విశాఖలో గూగుల్, హైదరాబాద్‌లో అమెజాన్ డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేస్తున్నారు.
ఇక్కడ కాస్త ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే… ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చి బెంగళూరుకు దక్కాల్సిన గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖకు తరలించుకుపోయిందని కర్ణాటక మంత్రులు ఆక్షేపించారు.
దానికి అంత భారీగా రాయితీలు, భూకేటాయింపులు ఇవ్వడం సరికాదంటూ విమర్శలు వినిపించాయి. అలవాటు ప్రకారం వైసీపీ ‘క్రెడిట్ చోరీ’ పాట వినిపించింది. ఎవరెన్ని విమర్శలు చేసినా ఏపీ ప్రభుత్వం మాత్రం గూగుల్‌ను విశాఖకు తీసుకు వచ్చింది.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అమెజాన్ డేటా సెంటర్లను హైదరాబాద్‌కు రప్పించుకునేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 420 ఎకరాల భూమి కేటాయించింది. అమెజాన్ సంస్థ రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో దీనిలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతోంది. ఈ భూకేటాయింపులకు అదనంగా తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.125 కోట్ల విలువైన రాయితీలు కూడా ఇవ్వబోతోంది.
విశాఖలో గూగుల్ కోసం ఏపీ ప్రభుత్వం భూములు, రాయితీలు ఇస్తే చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. ఈ డేటా సెంటర్లకు కూలింగ్ వ్యవస్థ కోసం భారీగా మంచినీరు అవసరమవుతుందని, కనుక ఇవి ఏర్పాటు అయితే జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య తప్పదని, అసలు డేటా సెంటర్ అవసరమా? అని ప్రశ్నించినవారూ ఉన్నారు.
విశాఖతో పోలిస్తే హైదరాబాద్ జనాభా చాలా ఎక్కువ. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న కొద్దీ నగర జనాభా కూడా నానాటికీ పెరుగుతూనే ఉంది.
ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హైదరాబాద్‌లో రాబోతోంది. మరి అక్కడ దీని వల్ల తాగునీటి సమస్య వస్తుందని ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదే! హైదరాబాద్‌లో లేని సమస్య విశాఖలో మాత్రమే ఎలా వస్తుంది? రెండూ భారీ డేటా సెంటర్లే కదా?
హైదరాబాద్‌లో ఇప్పటికే అమెజాన్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందుకే సంస్థ తన విస్తరణకు హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇస్తోంది.
అదే విధంగా ఏపీ ప్రభుత్వం గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థను విశాఖకు తీసుకువచ్చినందున, దాని అనుబంధ సంస్థలు, ఇతర టెక్నాలజీ కంపెనీలు కూడా విశాఖ వైపు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కదా?
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, రేపు మరో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఇలాంటి నిర్ణయాలు చూస్తే, విశాఖకు గూగుల్ డేటా సెంటర్‌ను తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన భూకేటాయింపులు, రాయితీలు తప్పు కాదని స్పష్టమవుతోంది.
అభివృద్ధిని రాజకీయ కోణంలో చూస్తూ విమర్శలు చేసేవారు ప్రతిచోటా ఉంటారు. కానీ భవిష్యత్ తరాలకు అభివృద్ధి ఫలాలు అందించాలంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. వాటిపై విమర్శలు వచ్చినా ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాల్సిందే.




