నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారులు ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని అయన నివాసానికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆయన అనుచరుడు, ఈ కేసులో మరో నిందితుడుగా భావిస్తున్న ఆరేపల్లి రాముని కూడా అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న అద్దేపల్లి జనార్ధన రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వారిరువురినీ అరెస్ట్ చేశారు. జోగి రమేశ్ ప్రోదల్భం, సహాయ సహకారాలతోనే తాను 2023లో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేశానని అద్దేపల్లి జనార్ధన రావు చెప్పారు.
జోగి రమేశ్ అరెస్టుపై వైసీపీ ఏవిదంగా స్పందిస్తుందో ఊహించవచ్చు. అసలు మద్యం కుంభకోణమే జరగలేదంటూ వాదిస్తున్న వైసీపీ, కూటమి ప్రభుత్వంలో పెద్దలే నకిలీ మద్యం వ్యాపారాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని ఎదురుదాడి చేస్తోంది. కనుక వైసీపీపై కక్షతోనే ఈ తప్పుడు కేసు సృష్టించి జోగి రమేశ్‌ని, వైసీపీ నేతలను అరెస్టు చేయిస్తోందని ఆరోపిస్తారు.
అయితే ఈ కేసు, అరెస్ట్, దానిపై అధికార, ప్రతిపక్ష పార్టీ మద్య సాగాబోయే విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ పక్కన పెడితే, తర్వాత తతంగం అంతా మళ్ళీ రోటీన్‌గానే సాగి ముగుస్తుందని అందరికీ తెలుసు.
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ‘రాష్ట్రంలో ప్రకంపనలు…నేడో రేపో అంతిమ లబ్దిదారు అరెస్ట్…’ అంటూ మీడియా ఊదరగొట్టింది. కానీ ఏం జరిగింది? మిథున్ రెడ్డితో సహా ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరూ బెయిల్‌పై బయటకు వచ్చేసి యధాప్రకారం రాజకీయాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు!
ఇప్పుడూ అలాగే జరుగుతుంది. ఈలోగా కూటమి ప్రభుత్వం-వైసీపీల మద్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతాయి.
ఈలోగా జోగి రమేశ్ ముందస్తు బెయిల్‌తో తర్వాత జరగాల్సిన కార్యక్రమం మొదలుపెడతారు. దొరకకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టుని ఆశ్రయించి బెయిల్‌పై బయటకు వస్తారు. అంత వరకే పోలీసులు ఆయనని జైల్లో బందించి ఉంచగలరు.
కనుక 30-60 రోజులు జైల్లో ఉంచడమే గొప్ప విషయమని కూటమి ప్రభుత్వం భావిస్తే, అన్ని రోజుల్లో వైసీపీ హడావుడి చేసి రాజకీయ మైలేజ్ లేదా ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది. తర్వాత అంతా మామూలే!
కనుక మద్యం కుంభకోణం, ఇప్పుడీ నకిలీ మద్యం కేసు ఏదైనా సరే దోషులకు శిక్షలు పడవు. వారి చేత అవినీతి సొమ్ము కక్కించలేరు.
కానీ వారి అదృష్టం బాగుంటే మళ్ళీ వారే అధికారంలోకి వచ్చి ఈ కేసులన్నీ ఎత్తేసుకుంటారు. అప్పుడు వారు తమ ‘డిజిటల్ డెయిరీ’ బయటకు తీసి మళ్ళీ ఇలాగే మాస్ మసాలా కమర్షియల్ సినిమా చూపిస్తూ జనాలను రంజింపజేస్తారు. కనుక అవినీతిపరులు చూపించే ఈ సినిమాలో ప్రజలు కేవలం ప్రేక్షకులు మాత్రమే.







