విశాఖ రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి రూ.4-500 కోట్లు ఖర్చు చేసి ఋషికొండపై నిర్మించుకున్న విలాసవంతమైన భవనాన్ని చూపుకునే దుస్థితి నెలకొని ఉండేది. అంత ముచ్చటపడి కట్టించుకున్న ఆ భవనంలో జగన్ కాలు పెట్టకమునుపే పదవి కోల్పోవడం విశేషం.
ఇంతకాలం ప్రతిపక్షాలు, మీడియా ఎవరూ దాని దరిదాపులకు కూడా వెళ్ళనీయకుండా పోలీసులను కాపలాగా పెట్టి అడ్డుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తొలిసారిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాని వెంటబెట్టుకొని ఋషికొండ ప్యాలస్‌లోకి వెళ్ళి, లోపల ఏర్పాటు చేసుకున్న ఖరీదైన ఫర్నీచర్, ఇంటీరియర్, ఆ హంగూ ఆర్భాటాలు చూసి షాక్ అయ్యారు.
జగన్ ఒక్కరి కోసమే ఇంతగా ప్రజాధనం వృధా చేశారా? అని గంటా శ్రీనివాసరావు సైతం ఆశ్చర్యపోయారు. ఆయన వెంట వెళ్ళిన మీడియా ప్రతినిధులు ఆ భవనం అంతా కలియ తిరిగి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. వాటిని చూస్తున్న సామాన్య ప్రజలు సైతం దిగ్బ్రంతి చెందుతున్నారు.
అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, “ఋషికొండపై పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడిన ‘హరిత రిసార్ట్స్’ ని జగన్ కూలగొట్టించి, పచ్చటి చెట్లతో నిండి ఉన్న ఋషికొండను తవ్వించేసి, నాలుగైదు వందల కోట్లు ఖర్చు చేసి తన కోసం ఈ విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. భవనంలో ఏర్పాటు చేసిన ఫర్నీచర్ వగైరా ఆయన ఎక్కడ నుంచి తెప్పించారో కానీ అన్నీ చాలా చాలా ఖరీదైనవనే అర్దమవుతోంది.
ఇక ఈ భవనాలను మళ్ళీ హరిత రిస్సార్ట్స్ గా మార్చుదామన్న దీనిలో ఎక్కువ గదులు లేవు. అలాగని భవనాలు చిన్నవిది కావు. కనుక ప్రస్తుతానికైతే ఇది ఉపయోగించుకోవడానికి పనికి రాని తెల్ల ఏనుగువంటిదే. దేనికో దానికి వాడుకున్నా, వాడుకోకుండా అలా ఉంచేసినా దీనిపై జగన్ చేసిన ఖర్చు చేసిన వందల కోట్లు వృధా చేసిన్నట్లవుతుంది. దీనిని ఇప్పుడు ఏవిదంగా ఉపయోగించుకోవాలో కూడా అర్దం కావడం లేదు. త్వరలో సిఎం చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన స్వయంగా చూసిన తర్వాత దీనిని ఏవిదంగా వాడుకోవాలో నిర్ణయిస్తారు,” అని అన్నారు.
జగన్ తాను పేదవాడినని, తనకు చంద్రబాబు నాయుడులాగా మీడియా, కంపెనీలు, వేలకోట్లు ఆస్తులు లేవని, తన వెంట ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా పేదవారు, ఆణిముత్యాలని పదేపదే చెప్పుకునేవారు. ఆ పేదవాడు తన కోసం రూ.4-500 కోట్లు ఖర్చు చేసి కట్టుకున్న భవనాలు ఇవి. ఆయన పేదరికం ఏవిదంగా ఉంటే సామాన్య ప్రజలు, పేదల పేదరికాన్ని ఎలా కొలవాలి?






