గిడుగువారి పుణ్యామని తెలుగు భాషకి గౌరవం… దక్కేనా?

Gidugu Venkata Ramamurthy Telugu Language Day

తెలుగుని గ్రాంధికం నుంచి వాడుక భాషకి తెచ్చిన మహనీయుడు గిడుగు రామమూర్తి గారు. నేడు ఆయన జయంతి.

ADVERTISEMENT

ప్రపంచంలో ఏ భాష అయినా భావ వ్యక్తీకరణ కోసమే. అయితే ఆ భాషకి కొందరు కవులు, రచయితలు ఎప్పటికప్పుడు కొత్త సొబగులు అద్దుతుంటే మరింత వినసొంపుగా మారుతుంటుంది.

కానీ ఆ కారణంగా అది సామాన్య ప్రజలు వినియోగించుకోలేని స్థితికి చేరుకుంటే అది నల్లధనంలా కొందరికే పరిమితమవుతుంది.

ఆనాటి కాలమాన పరిస్థితులు, ఇతర కారణాల వలన తెలుగులో గ్రాంధికం వాడకం ఎక్కువగా ఉండేది. మన పాత సినిమాలలో కూడా అది చూడవచ్చు.

అయితే సామాన్య ప్రజలు కూడా సులువుగా అర్ధం చేసుకొని మాట్లాడగల భాష చాలా అవసరమని గిడుగు రామమూర్తిగారు గ్రహించి ‘వాడుక భాష’ని పరిచయం చేశారు. దానిని ఓ ఉద్యమంగా చేపట్టి చివరికి అందరినీ వాడుక భాష వైపు మళ్ళించగలిగారు.

ఇప్పటికే గిడుగు రామమూర్తిగారి పుట్టు పూర్వోత్తరాలు, పరిశోధనలు, రచనలు, ఉద్యమాలు, వాటికి వ్యతిరేకంగా జరిగిన సాహిత్య పోరాటాల గురించి అనేక పుస్తకాలు, కధనాలు వచ్చాయి. ఆ వివరాలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా లభిస్తున్నాయి.

ఈ సందర్భంగా తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పుకోవడం చాలా అవసరం కనుక వాటి గురించి మళ్ళీ చెప్పుకోవడం లేదు.

తెలుగు భాష గ్రాంధికం నుంచి వ్యవహరికంలో మారేందుకు చాలా దశబ్ధాలు పట్టింది. కానీ వ్యవహారికంలో నుంచి ‘సంకర భాష’గా మారేందుకు ఎక్కువ సమయం పట్టలేదంటే చాలా మందికి కోపం రావచ్చు కానీ తెలుగు భాషాభిమానులకి ఇది నిజమని తెలుసు.

సుమారు నాలుగు దశాబ్ధాల క్రితం ‘ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్’ చదువులతో ఈ తెలుగు భాష విధ్వంసం ప్రారంభమైందని చెప్పవచ్చు. మరోవిదంగా చెప్పాలంటే, తల్లి తండ్రులు, సమాజం, ప్రభుత్వాలు అందరూ కలిసి పిల్లలకి తెలుగు భాషతో కనెక్షన్ కట్ చేశారని చెప్పవచ్చు.

అప్పటి నుంచే తెలుగు చదవడం, వ్రాయడం, మాట్లాడటానికి ఇబ్బంది మొదలైందని చెప్పవచ్చు. ఆ ఇంగ్లీషు మోజు ఏ స్థాయికి చేరిందంటే ఇంట్లో పెంపుడు కుక్కలకి కూడా ఇంగ్లీషులో చెపితే తప్ప అర్దం కాదనే స్థాయికి వెళ్ళిపోయింది.

ఇంగ్లీష్ మీడియం చదువుల అనేక లక్షలమంది ఉన్నతోద్యోగాలు సాధించి ఉండవచ్చు. సమాజం గర్వించేంతగా ఉన్నత స్థానాలకు ఎదిగి ఉండవచ్చు. కానీ ఆ క్రమంలో తెలుగు భాష క్రమంగా కుచించుకు పోయిందని చెప్పక తప్పదు.

ఆ తర్వాత విదేశాలలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు, మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా, ‘తెలుగు సినిమాలు’ వంటివన్నీ కలిసి తెలుగు భాషని నిరంతరంగా చంపేస్తూనే ఉన్నాయి.

పాలలో తేనెలా తెలుగు భాషలో సంస్కృతం విడదీయలేనంత, గుర్తించలేనంతగా ఎప్పుడో కలిసిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ భాషలు కూడా కలిసిపోతున్నాయి. అయితే ఇంగ్లీష్, హిందీ భాషలు మాత్రం తెలుగుని మింగేస్తున్నాయి.

బస్, రైల్, కార్, పోలీస్ వంటి అనేక ఇంగ్లీషు పదాలను మనం బస్సు(లు) రైలు(ళ్ళు), కారు(ర్లు), పోలీసు(లు)గా తెలుగులోకి మార్చేసుకొని వాడేసుకుంటున్నందుకు సంతోషించాల్సిందే.

కానీ తెలుగు భాష ఆనవాలు కనబడకుండా జరుగుతున్న పద ప్రయోగాలు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు భాషాభిమానులకు బాధ కలుగుతుంది.

ముఖ్యంగా ఇప్పటి తరానికి తెలుగు మీద పట్టులేకపోతే పోయే కనీసం మన భాష అనే అభిమానం లేకపోవడం బాధ కలిగిస్తోంది.

ఇది మన గుర్తింపుని మనమే వదులుకోవడంగానే చెప్పవచ్చు. మరోవిదంగా చెప్పాలంటే మన వంశం, మన ఇంటి పేరు, మన తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు, చివరికి మన సొంత పేరు, చిరునామా లేకపోతే ఏవిదంగా అనాధగా మిగిలిపోతామో, తెలుగుని వద్దనుకుంటే కూడా అలాగే ఉంటుంది.

కానీ ఆ గుర్తింపుని కూడా వదులుకోవడానికి ఎవరూ సంకోచించడం లేదు. ఆనాడు గిడుగు రామమూర్తిగారు చేపట్టిన వాడుక భాష ఉద్యమం చివరికి ఈవిదంగా పరివర్తన చెందడం బాధాకరమే.

అయితే తెలుగు భాష ఓ జీవనది వంటిది. దానిలో అనేక వ్యర్ధాలు చేరి కొట్టుకుపోతూనే ఉంటాయి. కనుక తెలుగు భాషని సంకరం, కలుషితం చేస్తున్న ఆ వ్యర్ధాలని చూసి ఎంత బాధ పడినా ప్రయోజనం ఉండదు.

జీవనది వంటి తెలుగు భాషని కాపాడుతున్నది సాహిత్యవేత్తలో, పండితులో, ప్రభుత్వాలో కాదు. మాండలికాలు వాటిని అలవోకగా ఉపయోగించుకుంటున్న సామాన్య ప్రజలే.

కానీ ఆనాడు తెలుగు భాషని చక్రవర్తులు, రాజులు, సంస్థాధీశులు కాపాడి పోషించిన్నట్లే, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా తెలుగు భాషని ప్రోత్సహిస్తే చాలు తప్పక మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది.

ADVERTISEMENT
Latest Stories