‘ఫ్రీడం 251’ పేరుతో కేవలం 251 రూపాయలకే ‘రింగింగ్ బెల్స్’ అనే సంస్థ స్మార్ట్ ఫోన్ అమ్మకం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే బుకింగ్స్ విషయంలో తొలి రోజు ‘వెబ్ సైట్’ క్రాష్ వలన ఏర్పడిన గందరగోళం నేపధ్యంలో దాదాపుగా 33 వేల మంది మాత్రమే ఫోన్ ను బుక్ చేసుకున్నారు. అయితే తదుపరి రెండు రోజుల్లో దాదాపుగా 7 కోట్ల మంది ‘ఫ్రీడం 251’ను బుక్ చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈ స్థాయిలో ఒకేసారి తాము ఫోన్లను పంపిణీ చేయలేమని, తొలి విడతగా 25 లక్షల ఫోన్లను ఏప్రిల్ నుండి డెలివరీ చేస్తామని సంస్థ ప్రకటించిన విషయమూ గతంలోనిదే.
అయితే ఈ సంస్థపై దేశ వ్యాప్తంగా జరిగిన ప్రచారంతో వినియోగదారులలో రకరకాల సందేహాలు తలెత్తాయి. దీంతో తొలిరోజు బుక్ చేసుకున్న వారి సొమ్ము పరిస్థితి ఏమిటన్న విషయం సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలను లేవనెత్తింది. అయితే వీరి కోసమే ‘రింగింగ్ బెల్స్’ సంస్థ తాజాగా ఒక ప్రకటన చేసింది. తొలి రోజు బుక్ చేసుకున్న దాదాపు 30 వేల మందికి తిరిగి వారి డబ్బులు వారికి చెల్లిస్తామని, అందరికీ ఫోన్ డెలివరీ చేసిన తర్వాతే డబ్బులు తీసుకుంటామని తాజాగా ప్రకటించింది. రెండు, మూడవ రోజు బుక్ చేసుకున్న వారి దగ్గర నుండి ఎటువంటి పైకము తీసుకోలేదని సంస్థ స్పష్టం చేసింది.
దీంతో ఇప్పటివరకు ఈ సంస్థ చిత్తశుద్ధిపై ఆరోపణలు గుప్పించిన వారికి సమాధానం లభించినట్లయ్యింది. మరోవైపు వినియోగదారులు కూడా ‘గాలిలో దీపం పెట్టి ఎదురు చూడాల్సిన పని లేకుండా’ తాము చెల్లించిన “విలువైన” 251 రూపాయలు కూడా వెనక్కి రావడం సంతోషాన్ని కలిగించే అంశం. మొత్తానికి ‘క్యాష్ ఆన్ డెలివరీ’ నిర్ణయం తీసుకున్న సంస్థపై ప్రస్తుతం ప్రశంసలు లభిస్తున్నాయి.





