పదును లేని బాణంతో అక్కర్లేని యుద్ధం

Rama Banam Movie Talkకమర్షియల్ సినిమాకు డెఫినిషన్ చెప్పమంటే కొందరు గుడ్డిగా నాలుగు ఫైట్లు అయిదు పాటలు అనేస్తారు కానీ గత దశాబ్ద కాలంలో వచ్చిన అనూహ్య మార్పుల మీద అవగాహన ఉన్న వాళ్ళు అలా చెప్పరు. దర్శకుడు శ్రీవాస్ కు అయిదేళ్లకు పైగా గ్యాప్ వచ్చేసింది. ఫాంటసీ టచ్ తో బెల్లం హీరోతో సాక్ష్యం తీస్తే బాక్సాఫీస్ వద్ద తిరస్కారం ఎదురయ్యింది. సరే మనకు రొటీన్ ఫార్ములానే కరెక్ట్ అనుకున్నారేమో కానీ ఇండస్ట్రీ నుంచి చాలా ఏళ్ళ క్రితమే సెలవు తీసుకున్న భూపతిరాజా దగ్గర రామబాణం అనే కథను కొనుక్కొచ్చారు. ఒకప్పుడు శుభలగ్నం, ముఠామేస్త్రి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లకు స్టోరీలిచ్చిన ట్రాక్ రికార్డు ఆయనది. సరే పాయింట్ బాగుంటే చాలనుకున్నారు.

ఓ మంచి అన్నయ్య(జగపతిబాబు). అతనికో ఆవేశపరుడైన తమ్ముడు విక్కీ(గోపిచంద్). చిన్నప్పుడే హీరోకి పౌరుషం వచ్చి ఇంట్లో వాళ్ళతో గొడవపడి డబ్బు సంపాదించుకుని వస్తానని కోల్కతా వెళ్ళిపోతాడు. ఓ పదేళ్ల టైం తీసుకుని డాన్ గా ఎదిగి కోట్లకు కోట్లు పోగేస్తాడు. ప్రేమించిన అమ్మాయి తండ్రి నీ కుటుంబాన్ని చూపిస్తేనే పెళ్లి చేస్తానని చెప్పడంతో అప్పటికప్పుడు ఫ్లైట్ వేసుకుని అమృత నిలయంలో కాలు పెడతాడు. తీరా చూస్తే సోదరుడి మీద శత్రువుల పడగనీడ ఉంటుంది. వాళ్ళను కాపాడుకోవడమే అతని తక్షణ కర్తవ్యం. తర్వాత అతనేం చేస్తాడు, విలన్ల ఆట ఎలా కట్టిస్తాడనేది దశాబ్దాల అనుభవమున్న ప్రేక్షకులు ఈజీగా చెప్పేయొచ్చు.

ADVERTISEMENT

దర్శకుడు శ్రీవాస్ రిస్క్ వద్దనుకున్నారు. మంచిది. దానికి తగ్గట్టే రొటీన్ టెంప్లేట్ లో సాగే ప్లాట్ ని తీసుకున్నారు అందులోనూ తప్పు లేదు. అయితే ట్రీట్ మెంట్ పరంగా ఏదైనా వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తే ఆడియన్స్ పోన్లే అని క్షమించేవాళ్ళు. కానీ అది ఏ కోశానా ఏ ఫ్రేమ్ లోనూ కనిపించదు. శ్రీవాస్ టీమ్ మొత్తం టైం మెషీన్ వేసుకుని 1980కి వెళ్ళిపోయి షూటింగ్ చేసుకొచ్చినట్టు ఉన్నాయి కథా కథనాలు. కోల్కతా నగరాన్ని వణికించే డాన్ జస్ట్ మన విక్కీ ఇద్దరు రౌడీలను కొట్టి మిర్చి రేంజ్ లో కారు అద్దాలు బద్దలు కొట్టి వార్నింగ్ ఇవ్వగానే వణికిపోతాడు. హైదరాబాద్ వచ్చిన హీరోకి రక్షణగా ఉండేందుకుకొచ్చిన బాడీగార్డులు కామెడీలు తమాషాలు చేస్తారు.

తెలిసిన కథని మళ్ళీ తీయడంలో తప్పేమి లేదు. కానీ ఎంత ఫార్ములా అయినా అందులో కొంతైనా క్రియేటివిటీ లేకుంటే జనం నిర్దాక్షిణ్యంగా డిజాస్టర్ చేస్తున్నారు. ఇది తెలిసి రామబాణంని ఎంచుకున్నందుకు శ్రీవాస్ కన్నా ఎక్కువగా వరస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ ని మెచ్చుకోవాలి. ఔట్ డేటెడ్ అయిపోయిన అన్నదమ్ముల ఎమోషన్ ని చూస్తూ కన్నీళ్లు కార్చేసే జనరేషన్ కాదిది. అలాంటిది కేవలం ఆ ఒక్క థ్రెడ్ ని పట్టుకుని సన్నివేశాలను సాగదీస్తూ పోతే మొదటి సగానికే నీరసం ఆయాసం రెండూ వచ్చేస్తాయి. మెప్పించే అవకాశమున్న పాయింట్ ని చేజేతులా పాడు చేసుకున్న రామబాణం చూస్తుంటే భస్మాసుర హస్తమే గుర్తొస్తుంది.

ADVERTISEMENT
Latest Stories