ఋషికొండ ప్యాలస్‌కి అమరావతి భవనాలకు పోలికా?

Gudivada Amarnath Rushikonda Palace Amaravati Buildings

ఋషికొండని కూడా పరదాలు వేసి దాచేయాలని ప్రయత్నించిన జగన్‌ ప్రభుత్వం, దానిపై రూ.4-500 కోట్ల ప్రజాధనం ఖర్చుచేసి జగన్‌ కోసం కట్టించుకున్న ప్యాలస్‌ని అలాగే దాచిపెట్టింది.

ADVERTISEMENT

మళ్ళీ తామే అధికారంలోకి వస్తామనే ధీమాతోనే దాని కోసం అన్ని వందల కోట్లు ఖర్చుపెట్టిందని భావించవచ్చు. కానీ రాకపోవడంతో ఆ రాజకోట రహస్యాలన్నీ ఒకటొకటిగా బయటపడుతున్నాయి.

ఎన్నికలలో పెత్తందారులకి, పేదవారికీ (వైసీపి)కి మద్య జరుగుతున్న పోరాటమని జగన్‌ పదేపదే చెప్పుకోవడంతో ఆ పేదవాడి కోసం రూ.4-500 కోట్లతో కట్టుకున్న ప్యాలస్ ఫోటోలు, వీడియోలు మీడియా, సోషల్ మీడియాలోకి రావడంతో ఇప్పుడు వైసీపి నేతలు జవాబు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

జగన్‌ తమ ఓటమికి ఈవీఎంలే కారణమనే పాయింట్ పట్టుకొని వాదిస్తుంటే, మరోపక్క మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు ఈ ‘పేదవాడి ప్యాలస్’ గురించి వితండవాదం చేస్తున్నారు.

“అది జగన్‌ కోసం కట్టుకున్న భవనం కాదు. ప్రభుత్వం కోసమే నిర్మించారు. ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. దానిని ఏవిదంగా వాడుకోవాలో వారే నిర్ణయించుకోవాలి.

రాష్ట్రపతి, ప్రధాని, విదేశీ ప్రముఖులు ఎప్పుడైనా విశాఖకు వస్తే వారికి బస చేసేందుకు సరైన భవనమే లేదు. కనుక ఋషికొండ ప్యాలస్‌ని అతిధి గృహంగా కూడా వాడుకోవచ్చు. కనుక టిడిపి నేతలు ఇలాంటి చిల్లర పనులు మానుకుంటే మంచిది.

ఆనాడు చంద్రబాబు నాయుడు రూ.6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అమరావతిలో తాత్కాలిక భవనాలు కట్టించారు కదా? వాటి గురించి ఎందుకు మాట్లాడరు?

ఋషికొండ ప్యాలస్‌ని చూపించినవారే జగన్‌ మొదలుపెట్టిన భోగాపురం విమానాశ్రయం, పోర్టులను, మా ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి పనులను కూడా చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా?” అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.

జగన్‌ ప్రజాధనంతో ఋషికొండపై విలాసవంతమైన ప్యాలస్‌ నిర్మించుకోగా, కేసీఆర్‌ కూడా విలాసవంతమైన ప్రగతి భవన్‌ నిర్మించుకున్నారు. జగన్, కేసీఆర్‌ ఇద్దరివీ రాజరికపోకడలే కనుక వారికి అది తప్పుగా అనిపించడం లేదు. అందుకే ఈవిదంగా వితండవాదం చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఇద్దరూ నియంతలు వాటిని వదిలిపెట్టి పోక తప్పలేదు.

అదే… చంద్రబాబు నాయుడు హయాంలో రూ.6,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన సచివాలయం, శాసనసభ, మండలి, హైకోర్టు తదితర భవనాలనే అప్పటి ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ 5 ఏళ్ళు ఆ భవనాలలోనే కూర్చొని రాష్ట్రాన్ని పాలించారు.

మళ్ళీ ఇప్పుడు ప్రజా కూటమి ప్రభుత్వం కూడా అందులోనే కొలువు తీరనుంది. రాబోయే 5 ఏళ్ళలో అమరావతి నిర్మాణ పనులు పూర్తయ్యేవరకు వాటినే ఉపయోగించుకోబోతోంది. ఆనాడు వాటిని తాత్కాలిక భవనాలని చెప్పడం ఓ పొరపాటే కానీ వరుసగా మూడు ప్రభుత్వాలు 15 ఏళ్ళు వాటిని ఉపయోగించుకుంటున్నాయన్న మాట!

ఇదేవిదంగా కేసీఆర్‌ కూడా సచివాలయం నిర్మిస్తే దానిని ఆయన తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్న ఆ భవనాలతో ప్రగతి భవన్‌, ఋషికొండ ప్యాలస్‌లని ఏవిదంగా సరిపోల్చగలము?

కేసీఆర్‌ రూ.5-600 కోట్లతో సచివాలయం నిర్మించారు. కానీ జగన్‌ తాను ఉండేందుకే దాదాపు అంత సొమ్ము ఖర్చు చేసి విలాసవంతమైన ప్యాలస్ నిర్మించుకున్నారు! జగన్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆయన అక్కడే కాపురం పెడతారని రోజా వంటివారు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు కదా?

మరిప్పుడు రాష్ట్రపతి, ప్రధాని, విదేశీ ప్రముఖుల కోసం కట్టించామంటూ బుకాయించడం దేనికి?ఐదేళ్ళు అమరావతిలో కూర్చొని రాష్ట్రాన్ని పాలించి ఇప్పుడు ఆ భవనాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా లేదా… మాజీ గుడ్డు మంత్రిగారు?

ADVERTISEMENT
Latest Stories