పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు, అయ్యప్పనమ్ కోషియం రీమేక్ అనే రెండు చిత్రాలు చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్లు ఆగిపోయాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా కరోనా బారినపడి ఇటీవల కోలుకున్నాడు. దానితో పూర్తిగా కేసులు తగ్గేవరకు షూటింగులు మొదలయ్యే అవకాశం లేదు.
ఈ గ్యాప్ లో క్రిష్ సినిమా యొక్క విఎఫ్ఎక్స్ పనిలో బిజీగా ఉన్నాడు. హరి హర వీర మల్లు విఎఫ్ఎక్స్ మరియు సిజిఐ పనులు చేయడానికి చిత్ర నిర్మాతలు ఏకంగా 50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే వింత అనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో బడ్జెట్ అనేది కనిపించడం లేదు.
తక్కువలో సినిమా చేసేశామా… పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ కారణంగా ఎక్కువ లాభాలు గడించామా అన్నట్టే ఉంటుంది వ్యవహారం. అటువంటి తరుణంలో కేవలం విఎఫ్ఎక్స్ కోసమే అంత ఖర్చు అంటే ఆశ్చర్యమే. ఇదిలావుండగా, ఈ చిత్రం 2022 జనవరిలోవిడుదల చెయ్యనున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.
హరి హర వీరమల్లు చాలా కాలం నుండి నిర్మాణంలో ఉంది. తాజాగా ఇప్పుడు షూటింగ్ ఆలస్యం కావడంతో నిర్మాత ఎ.ఎమ్.రత్నం చాలా ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి సీజన్ కోల్పోవడం అంటే మాటలు కాదు అందుకే వీలైనంత త్వరలో షూటింగ్ మొదలయ్యి ఆ టైమ్ కి సినిమా విడుదల కావాలని ఆయన కోరుకుంటున్నారు.



