నేడు వైసీపీ పార్టీకి ముహూర్త బలం చాల బలహీనంగా, వైసీపీ నాయకులకు బలంగా ఉన్నట్టుంది. అదును చూసి దెబ్బకొట్టినట్టుగా వైసీపీ పార్టీకి ఒక్కొక్కరుగా రాజీనామా లేఖలు సమర్పిస్తున్నారు. జగన్ చెప్పిన రెండు రాజధానులలో వైసీపీ నాయకులు జగన్ కు అనుకోని షాక్ ఇచ్చి పార్టీకి రాజీనామా చేశారు.
అలాగే రాష్ట్రంలో జగన్ నిర్మించుకున్న రెండు ప్యాలస్ ల సాక్షిగా ఈ రాజీనామా లేఖలు అధిష్టానానికి చేరడం ఇక్కడ గమనార్హం. తాడేపల్లి కేంద్రంగా ఆళ్ల రామకృష్ణ రెడ్డి, విశాఖ కేంద్రంగా అక్కడి స్థానిక ఎమ్మెల్యే కుమారుడు, గాజువాక పార్టీ ఇంచార్జ్ దేవాన్ రెడ్డి ఇంచార్జ్ బాధ్యతల నుండి తప్పుకుంటూ పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా దీనికి రెండు రోజుల ముందు కార్పోరేటర్ సాధిక్ కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
దేవాన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు గాజువాక ఇంచార్జ్ బాధ్యతలు గుడ్డు మంత్రి అమర్నాథ్ కి అప్పగించారు వైసీపీ అధిష్టానం. 2019 ఎన్నికల ముందు ఏవిధంగా అయితే వైసీపీ పార్టీలో చేరికల స్పీడ్ అందుకుందో ఇపుడే అదే విధంగా ఎన్నికలకు మూడు నెలల ముందు రాజీనామాలు స్పీడ్ మొదలయ్యింది.ఇది కూడా దేవుడి స్క్రిప్ట్ లో భాగమే అనుకుంటా.
అలాగే తాడేపల్లిలో కూడా ఆర్కే క్యాడర్ అంతా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఆర్కే కి మద్దతుగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలో ఆళ్ల రామకృష్ణ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు వైసీపీ క్యాడర్. ఇలా పార్టీ నుండి ఒక్కొకరుగా రాజీనామా చేసి బయటకు రావడంతో వైసీపీ పతనం మొదలయ్యింది…అంటూ టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఈ వార్తలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
ఇక తరువాయి వరుసలో నిలబడ్డాడనికి పోటీపడుతున్న వైసీపీ నాయకులు ఎవరనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. వరుస రాజీనామాలతో వైసీపీ అధిష్టానంలో గుబులు మొదలవడం, ప్రతిపక్ష పార్టీలు బలం పుంజుకోవడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో చర్చ ఊపందుకుంటుంది. బెల్లం పాకం చుట్టూ చీమలు చేరినట్టే గెలిచే పార్టీ చుట్టే నాయకుల తిరిగుతారని రాజకీయాలలో ఒక నానుడి ఉంది. ఇప్పుడు వైకాపా నేతలు కూడా అదే ఫార్ములాను పాటిస్తున్నట్టున్నారు.
ప్రస్తుతానికి పార్టీకి రాజీనామా చేసి తరువాత దశలో ఏపార్టీలో చేరేది తెలియచేస్తారు. బాబు అరెస్టుతో టీడీపీ పార్టీకి వచ్చిన సింపతీ, జనసేన పార్టీ చేరికతో వచ్చిన బలం బేరీజు వేసుకుని, తెలంగాణ ఫలితాలను లెక్కలు సరిచూసుకుని రానున్న రోజులలో వైసీపీ పార్టీనుండి రాజీనామాల పరంపర కొనసాగడం, ప్రతిపక్ష పార్టీలలో చేరికల అధ్యాయం మొదలవ్వడం తధ్యమే అనిపిస్తుంది. ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి ఏదిపడితే అది మాట్లాడే వైసీపీ నేతలు తమ నోటికి హద్దులు పెట్టుకుంటారో లేక అలానే రెచ్చిపోతారో వేచి చూడాలి.




