పంచాయతీ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులను పోలి ఉన్న రంగులను తొలగించాల్సిందిగా హై కోర్టు ఇచ్చిన ఉత్తరువులను అమలు చెయ్యడానికి తెగ బాధపడిపోతోంది జగన్ ప్రభుత్వం. సుప్రీం కోర్టుకు వెళ్లినా, హైకోర్టులో రివ్యూ పిటీషన్ వేసినా లాభం లేకపోవడంతో రంగుల గారడీకి తెగబడింది ప్రభుత్వం.
తమ పార్టీ రంగులతో పాటు మరో రంగు చేర్చి అది పార్టీ రంగులు కాదని బుకాయించే ప్రయత్నం చేసింది. నాలుగు రంగులకు అర్థాలు చెబుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మట్టిని సూచిస్తూ ఎర్రకోట రంగు, పాడి పంటలకు సూచనగా ఆకుపచ్చ, నీలి విప్లవానికి సూచికగా నీలం రంగు, పాల విప్లవానికి సూచనగా తెలుపు రంగులు వేయాల్సిందిగా సూచనలు చేసింది.
ప్రతీ భవనానికి నాలుగో రంగు కనీ కనిపించకుండా వేసాం అన్న పేరుకు వెయ్యాలని క్షేత్ర స్థాయిలోని అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ విషయం పై హై కోర్టు మరో సారి కన్నెర్రజేసింది. నాలుగు రంగుల జీవోను కొట్టివేసి, ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చినప్పుడే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పింది.
ముందుగా చెప్పినట్టుగా మూడు వారాలలో ఈ పని పూర్తి చెయ్యాలని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసులో ప్రభుత్వ వాదనకు పసలేదని నిపుణులు అంటున్నారు. కోర్టుని తప్పుదారి పట్టించే విధంగా ఉండటంతో మరింత ఇబ్బంది కలిగించవచ్చని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.



