ఎన్నికల సమయంలో, పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని పార్టీలు గెలుస్తామనే చెప్పుకుంటాయి. ఒకవేళ ఓడిపోతే చావు కబురు చల్లగా చెప్పిన్నట్లు, ఓ రెండు మూడు నెలల తర్వాత అదే మీడియాతో తాము ఓడిపోతామనే విషయం తమకు ముందే తెలుసని చెప్పుకుంటారు కేసీఆర్‌లాగ.
Also Read – ఆ పాఠాలు మనోడికి కూడా వర్తిస్తాయిగా?
అయితే పార్టీల నేతలు చెప్పుకోవడం వేరు ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ చెప్పడం వేరు. ఆయన ప్రస్తుతం ఏ పార్టీకి పనిచేయడం లేదు. కనుక ఇటీవల వివిద న్యూస్ ఛానల్స్‌కు ఇస్తున్న ఇంటర్వ్యూలలో తన అంచనాలను కుండబద్దలు కొట్టిన్నట్లు చెపుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలలో ఈసారి కూడా బీజేపీయే గెలిచి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పారు. దీంతో ఆయనపై కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు భగ్గుమంటున్నాయి. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆయన మీడియా ఇంటర్వ్యూలలో బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.
Also Read – ఈ మర్యాద, గౌరవం నాకొద్దు బాబోయ్!
అయితే ప్రధాని నరేంద్రమోడీ అంతటివాడు చెప్పినా తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ గెలవలేకపోయింది. కేసీఆర్ 100 సీట్లు పక్కా అని చెప్పినా 39కి మించలేదు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ గెలుస్తుందనో లేదా వైసీపి ఓడిపోతుందనో ఇంటర్వ్యూలలో చెపితే ఓటర్లు ప్రభావితమవుతారా? అంటే కాదనే అర్దమవుతోంది.
దేశంలో దాదాపు అన్ని ప్రధాన పార్టీలకు పనిచేసి, వాటిని అధికారం దక్కేలా చేసిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు అన్ని పార్టీలకు శత్రువుగా మారిపోవడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. యధార్ధవాది లోక విరోధి అంటారు పెద్దలు. నిజాలు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది.
Also Read – వంశీ, కొడాలినే టచ్ చేయలేకపోతే ఇక…
ఏపీ శాసనసభ ఎన్నికలలో ఈసారి వైసీపికి 51 కంటే తక్కువే సీట్లు వస్తాయని, కూటమి చేతిలో దారుణంగా ఓడిపోబోతోందని ప్రశాంత్ కిషోర్ అని చెప్పారు. కనుక జగన్మోహన్ రెడ్డికి కూడా కోపం వచ్చి ఉండవచ్చు.
అందుకే “ఆయన (ప్రశాంత్ కిషోర్) ఎక్కడ ఉన్నాడో… ఏం చేస్తున్నాడో తెలీదు కానీ ఆయన కంటే మన ఐ-ప్యాక్ టీమ్ చాలా సమర్ధంగా పనిచేస్తోందంటూ” జగన్ అక్కసు వెళ్ళగ్రక్కారు.
గత ఎన్నికలలో వైసీపి గెలుపుకి ప్రశాంత్ కిషోరే కారణమని పొగిడిన నోటితోనే ఇప్పుడు జగన్ ఈవిదంగా మాట్లాడటం పెద్ద వింతేమీ కాదు. ఎందుకంటే ఎవరైనా తాము మనసులో ఏమి కోరుకుంటున్నామో అదే ఎదుటవాడి నోటి నుంచి వినాలనుకుంటారు కనుక.
కానీ వైసీపి ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెపుతున్నారు కనుక వైసీపి నేతల ఆందోళన ఇంకా పెరుగుతుందని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి, “గత ఎన్నికల కంటే ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోబోతున్నామని, జూన్ 4వ తేదీన ఫలితాలు చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతుందని” చెపుతూ ఇంత గొప్ప విజయం అందిస్తున్నందుకు ఐ-ప్యాక్ టీమ్‌కు జగన్ అడ్వాన్సుగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు కూడా.
జగన్ కోపాన్ని వైసీపి సోషల్ మీడియా ద్వారా ప్రకటితమైంది. కానీ వైసీపి తనపై చేస్తున్న విమర్శలకు ప్రశాంత్ కిషోర్ అంతే ఘాటుగా జవాబు చెప్పారు.
“జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడేటప్పుడు వైసీపి నేతల గొంతులు ఎండిపోవచ్చు. కనుక పక్కనే నీళ్ళ బాటిల్ పెట్టుకొని మరీ ఫలితాలు చూడండి,” అంటూ వ్యంగ్యంగా అన్నారు.
ఆయన చెప్పిన ఈ ఒక్క ముక్కని పట్టుకొని సోషల్ మీడియాలో నెటిజన్స్, జూన్ 4న వైసీపి నేతలందరూ పొద్దునే టిఫిన్స్ చేసి బీపీ మాత్రలు వేసుకోండి… కాస్త గాలి ఆడేలా వదులుగా ఉండే ఖద్దరు బట్టలే ధరించండి… అనుచరులు లేదా బంధు మిత్రుల మద్య కూర్చొని ఎన్నికల ఫలితాలు చూడండి. ఎందుకైనా మంచిది అంబులెన్స్ సిద్దంగా ఉంచుకోండి… అంటూ ఎవరికి తోచిన సలహాలు వారు ఇచ్చేస్తున్నారు.