ఒక విజనరీ నాయకుడిగా ప్రత్యర్థుల నుండి కూడా ప్రశంసలు దక్కించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ముళ్ళ బాటలోనే ఉంటుంది.
1995 లో టీడీపీ పార్టీలో ఏర్పడిన సంక్షోభం సమయంలో మొదటిసారిగా టీడీపీ ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రిగా బాబు బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్టీఆర్ ను కాదని బాబు ను తమ నాయకుడిగా ఎన్నుకోవడంతో ఆ నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముందు ఎన్నో సవాళ్లు అడ్డుగోడలు మాదిరి నిలిచాయి.
అటు పార్టీ పై పట్టు సాధించుకుంటూ, ఇటు కుటుంబ సభ్యుల మద్దతు పెంచుకుంటూ పాలనలో తనదైన మార్క్ చూపించారు బాబు. దీనితో 1999 లో ఉమ్మడి ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలే బాబు రాజకీయ జీవితానికి ఓ అగ్ని పరీక్ష మాదిరి మారిపోయింది. ఎన్టీఆర్ నుండి పార్టీ పగ్గాలు బాబు చేతికి రావడంతో ప్రత్యర్థులు మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా బాబును విమర్శించడం మొదలుపెట్టారు.
అయితే ఎన్టీఆర్ కే ద్రోహం చేసిన వ్యక్తిగా ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు ప్రజలలో ఎంత బలంగా వెళ్ళాయో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు బాబుకి అత్యంత కీలకంగా మారాయి. అయితే ఈ విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయకుండా మళ్ళీ బాబుకే పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎన్టీఆర్ ను కాదని తనకు మరోమారు అవకాశం కల్పించడంతో ప్రజలు తన పై ఉంచిన నమ్మకానికి పూర్తి న్యాయం చేసారు బాబు.
హై టెక్ సిటీ నిర్మాణంతో ఐటీ రంగాన్ని తెలుగు రాష్ట్రాన్ని పరిచయం చేసి హైద్రాబాద్ రూపురేఖలు మార్చి దేశమే కాదు ప్రపంచమే హైద్రాబాద్ వైపు చూసేలా అడుగులు వేసి సైబరాబాద్ వంటి మహా నగరాన్ని నిర్మించారు. ఇలా అధికారంలో ఉన్నా ఈ తొమ్మిదేళ్లు పార్టీలో సంక్షోభం తలెత్తకుండా చూసుకోవడానికి నాలుగేళ్లు, ప్రజలు తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరో ఐదేళ్లు కాళ్లకు చక్రం కట్టుకుని తిరిగి కొండ ప్రాంతాన్ని మాహా నగరం గా మార్చారు.
తరువాత తొమ్మిదేళ్ల అధికార పక్షం నుండి పదేళ్ల ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అయితే ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కూడా బాబు అవే సవాళ్ళను స్వీకరించారు. వైస్సార్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవమానాలను, వెక్కిరింపులను ఎదుర్కున్నారు బాబు. అసెంబ్లీలో హేళన చేయడం,ఒక ప్రతిపక్ష నేతకు ఇచ్చే కనీస గౌరవం ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా వైస్సార్ హయాంలో బాబు ఎదుర్కున్న అవమానాలు.
పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉండడంతో నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి పోవడం, ఆ సమయంలోనే ఏపీ విభజన జరగడం అటు తెలంగాణానా.? ఇటు ఆంధ్రానా.? అంటూ విడతీయలేని చిక్కు ప్రశ్నలు ఎదురవ్వడం అన్ని బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జరిగాయి. ఇక రాష్ట్ర విభజన జరిగిపోయింది విభజిత ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాబుకు మళ్ళీ ముళ్ళ బాటే ఎదురయ్యింది.
ఆదాయం లేక, రాజధాని తెలియక, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో, ఎక్కడి వరకు ఆలోచనలు చేయాలో కూడా తెలియని పరిస్థితులలో ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న బాబు అమరావతితో మొదలుపెట్టి, పోలవరం వరకు అన్నింటి మీద ఒక క్లారిటీకి వచ్చారు. సరిగ్గా రోడ్డులే లేని ప్రాంతానికి కేంద్ర సంస్థలను తీసుకు వచ్చారు. పరిశ్రమలు అన్న పేరే వినిపించని ప్రాంతానికి కియా, శ్రీ సిటీ వంటి నిర్మాణాలు చేపట్టి పెట్టుబడులను తీసుకువచ్చారు.
సన్ రైజ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను ఆహ్వానిస్తూ వారికి అవసరమైన సౌకర్యలన్ని కల్పిస్తూ సైబరాబాద్ నిర్మాణాల మాదిరి అమరావతిలో నిర్మాణాలకు పునాదిరాళ్లు వేశారు. అయితే తనకున్న ఐదేళ్ల సమయంలో ఎంత చేయగలరో అంతా చేసి రాష్ట్రాన్ని ఒక గాడిలోకి తీసుకువచ్చి మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. అయితే ఈ ఐదేళ్ల ప్రతిపక్ష పాత్ర బాబు రాజకీయ జీవితంలో గడిపిన చీకటి రోజులనే చెప్పాలి.
ఎన్నడూ లేని అవమానాలు, ఎప్పుడు వినని విమర్శలు, చివరికి తన భార్యను కూడా రోడ్డుకు లాగిన సందర్భాలు, నాలుగు దశబ్దాల రాజకీయ జీవితంలో ఊహకు కూడా ఎదురవ్వవని పరిస్థితులను బాబు జగన్ ప్రభుత్వంలో ఎదుర్కొన్నారు. అరెస్టు చేసి సుమారు 50 రోజుల పాటు జైల్లో పెట్టడం, ఆ సమయంలో టీడీపీ పార్టీని కనుమరుగు చేయాలి జగన్ భావించడం అన్ని కూడా ఐదేళ్ల సమయంలోనే బాబు ఏడు పదుల వయస్సులో ఎదుర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం బాబు పట్ల వ్యవహరించిన తీరుకు ప్రజలే కాదు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జనసేన టీడీపీ కూడా ఒక్కటయ్యాయి. అయితే ఈ ఐదేళ్లలో జగన్ చేసిన అన్యాయానికి తాము న్యాయం చేస్తామంటూ ముందుకొచ్చి మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, తెచ్చిన పరిశ్రమలను తరిమేసి రాష్ట్రాన్ని అస్తవ్యవస్తం చేసారు జగన్.
అధికారంలోకి వచ్చాము అనే ఆనందం కన్నా వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడం ఎలా అన్నదే బాబు కు ఇప్పుడు ఎదురవుతున్నపెద్ద సమస్య. బాబుకి ముఖ్యమంత్రి ఎప్పుడు ఒక ముళ్ళ కిరీటమే అవుతుంది. రాష్ట్రము ఎప్పుడు క్లిష్ట సమయంలో ఉన్న అప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాబే ఉంటారు. అలాగే తానూ ఎప్పుడు ప్రతిపక్షములో ఉన్న ఆ సందర్భంలో ఎప్పుడు క్లిష్ట పరిస్థితులనే ఎదుర్కుంటారు. అందుకే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బాబు రాజకీయ జీవితం ఎప్పుడు ముళ్ళ బాటే.






