సినిమాల హిట్, ఫ్లాప్ విషయంలో ప్రస్తుతం మీడియా కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే సహజంగా ఒక మీడియా వర్గాలకు ఆడియో ప్రసార హక్కులను అమ్మివేస్తే, మరో మీడియా ఆ సినిమాను టార్గెట్ చేస్తూ కధనాలు ప్రసారం చేయడం చూస్తూనే ఉన్నాం. దీంతో తమ సినిమాకు అన్ని మీడియా వర్గాలను సంతృప్తి పరచడానికి 14 రీల్స్ సంస్థ ఫిక్స్ అయినట్లుగా కనపడుతోంది.
రామ్ హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ “హైపర్” అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ను టీవీ 5 వేదికగా విడుదల చేయగా, తాజాగా రెండు, మూడు పాటలను విడుదల చేయడానికి మరో ఛానల్ ను ఎంచుకుంది. ఈ రోజు మూడన్నర్రకు ఎన్టీవీ వేదికగా విడుదల చేయనున్నామని తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అలాగే సినిమాలోని ఇతర పాటలను విడుదల చేయడానికి మిగిలి ఉన్న ప్రధాన ఛానల్స్ ను ఎంపిక చేసుకోనుందన్న సమాచారాన్ని చెప్పకనే చెప్పింది.
తద్వారా అన్ని మీడియా వర్గాల సహకారం ‘హైపర్’కు లభిస్తుందని, ముఖ్యంగా రామ్ హీరోగా నటించిన గత సినిమా ‘నేను… శైలజ…’ విషయంలో ఏర్పడ్డ మీడియా విభేదాలు తలెత్తకుండా, ‘హైపర్’ను విడుదల చేయడానికి నిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కనపడుతోంది. పబ్లిసిటీ విషయంలో 14 రీల్స్ సంస్థ ఎప్పుడూ వెనక్కి తగ్గదన్న విషయాన్ని గతంలో కొన్ని సినిమాలు నిరూపించిన విషయం తెలిసిందే.



