గత ఏడాది సంచలనం సృష్టించిన కేసులలో ఐబొమ్మ రవి (ఇమ్మంది రవి) కేసు కూడా ఒకటి. టాలీవుడ్ సినిమాలను పైరసీ చేయడమే కాకుండా ‘దమ్ముంటే నన్ను పట్టుకోండి,’ అని తెలంగాణ పోలీసులకు సవాలు కూడా విసిరాడు. విదేశాలలో ఉన్న అతను గత ఏడాది నవంబర్‌లో హైదరాబాద్ వచ్చినప్పుడు, పోలీసులు పట్టుకొని జైలుకి పంపించారు.
ఆ కేసులో అతనికి తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది ఫిభ్రవరిలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ పోలీసులకు పాస్ పోర్ట్ అప్పగించాలి. విదేశాలకు వెళ్ళరాదు. ఇంటర్నెట్ వాడరాదు. పోలీసులు పిలిచినప్పుడల్లా పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలంటూ న్యాయస్థానం విధించిన షరతులతో అతని పరిస్థితి తలక్రిందులైంది.
కనుక పోలీసులు ఫ్రీజ్ చేసిన తన బ్యాంక్ అకౌంటులో రూ.3 కోట్లు వాడుకునేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ వేశాడు. తన కుటుంబ పోషణకు, వైద్య చికిత్సకు కూడా చేతిలో డబ్బులేదని కనుక బ్యాంకులో ఉన్న ఆ సొమ్ము వాడుకునేందుకు అనుమతించాలని అభ్యర్ధించాడు.
అయితే అతను అదేమీ కష్టపడి సంపాదించిన డబ్బు కాదు. సినిమా పైరసీ ద్వారా సంపాదించినదే. కనుక అది తన సొమ్ము అని అతను చెప్పుకుంటే, అంత సొమ్ము ఏవిధంగా సంపాదించాడో లెక్కలు చెప్పాల్సి ఉంటుందనే విషయం మరిచినట్లున్నాడు.
పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారణ జరిపినప్పుడు అతని వద్ద మొత్తం 21,000 పైరసీ సినిమాలున్నాయని, వాటి ద్వారా అతను సుమారు రూ.20 కోట్లు సంపాదించినట్లు తెలిపారు. ఆ లెక్కన మరో రూ.17 కోట్లకు ఐబొమ్మ రవి లెక్క చెప్పాల్సి ఉంటుంది.
కనుక ఐబొమ్మ రవి ఆ సొమ్ము తనదని చెప్పుకున్నా అందుకు పోలీసులు, కోర్టులు అంగీకరించకపోవచ్చు.





