వైసీపికి ప్రతిపక్ష హోదా ఇస్తే శాసనసభ సమావేశాలకు వస్తారా?

ys jagan

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కనుక త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. నేడో రేపో తేదీలు ప్రకటించనున్నారు.

ఆనాడు జగన్‌ సమక్షంలో కొడాలి నాని తదితరులు చంద్రబాబు నాయుడు దారుణంగా అవమానించినప్పుడు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానని శపధం చేసి వచ్చేశారు. ఆ ప్రకారమే ఇప్పుడు ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెడుతున్నారు.

ADVERTISEMENT

పవన్‌ కళ్యాణ్‌ తొలిసారిగా శాసనసభ్యుడిగా, ఉప ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. వారితో పాటు టిడిపి, జనసేన, బీజేపీ మూడు పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 164 మంది శాసనసభలో ఉంటారు. వైసీపిలో జగన్‌తో కలిపి కేవలం 11 మంది మాత్రమే శాసనసభలో ఉంటారు.

ఇటీవల జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో తన ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ, “టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటుందో లేదో తెలియదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి శాసనసభలో మనకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తుందో లేదో తెలీదు…” అంటూ ఇంకా చాలానే మాట్లాడారు.

అంటే సిఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి తమకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలని జగన్‌ కోరుకుంటున్నట్లు అర్దమవుతోంది. ఇస్తే శాసనసభ సమావేశాలకు తప్పకుండా వస్తారా?అంటే అనుమానమే.

ఆనాడు శాసనసభలో చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకునే అంతగా అవమానించినందుకు టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. కనుక శాసనసభలో టిడిపి, జనసేనల ర్యాగింగ్ భరించడం చాలా కష్టమే.

కానీ జగన్‌తో సహా వైసీపి ఎమ్మెల్యేలు అందరూ తప్పనిసరిగా ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారాలు చేయడానికైనా శాసనసభకు రాక తప్పదు

“మేము ఏ తప్పు చేయలేదు. కనుక ఓడిపోయినా గర్వంగా తలెత్తుకుని ప్రజల మద్య తిరుగుతామని” మాజీ మంత్రి రోజా చెప్పారు. కానీ ఆమెతో సహా కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు వంటి నోటి దురుసు ప్రదర్శించిన వారు అదృష్టం కొద్దీ ఈసారి ఎన్నికలలో ఓడిపోవడం వలన శాసనసభకు రాకుండా తప్పించుకోగలుగుతున్నారు. ఒకవేళ వాళ్ళు కూడా గెలిచి శాసనసభకి వస్తే ఎలా ఉండేదో?

కానీ గెలిచిన జగన్‌తో సహా 11 మంది ఎమ్మెల్యేలు కూడా శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకొని పారిపోకుండా నివారించి రప్పించాలంటే వైసీపికి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడమే మంచిదేమో? కానీ ఇచ్చినా వస్తారనే నమ్మకం లేదు.

ADVERTISEMENT
Latest Stories