ఆంధ్రా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మొదటి ఛాన్స్ ఇవ్వడం నిజంగా ఆయన అదృష్టమే. కానీ ఈసారి ఎన్నికలలో పూల నావలా సాగిపోతూ అవలీలగా 175/25 సీట్లు గెలుచుకుంటామనుకుంటే ఎంతగానో ఎదురీదవలసి రావడం, అయినా ఓడిపోయే సూచనలు కనిపిస్తోంది.
కనుక ప్రజలు తమకు ఇచ్చిన ఆ మొదటి ఛాన్స్ ఎంత గొప్పదో ఈపాటికి జగన్‌కు, వైసీపి నేతలకు కూడా అర్దమయ్యే ఉంటుంది.
కనుక తమకు ప్రజలు మరొక్క ఛాన్స్ ఇస్తే, ఈ తప్పులన్నీ దిద్దుకుని, రాజధాని ఏర్పాటు చేసి, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని జగన్, వైసీపి నేతలు ఎన్నికల ప్రచారంలో సిగ్గు విడిచి చెప్పుకుని ఉంటే ఏమైనా సత్ఫలితాలు వచ్చేవేమో?
కానీ నేటికీ తాము ఎంచుకున్న విధానం అదే… ‘సంక్షేమ పధకాలతో రాష్ట్రాభివృద్ధి’ సరైనదే అని వాదిస్తున్నారు. ప్రజలు అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిసి ఉన్నప్పటికీ, వైసీపి గెలిస్తే జూన్ 9వ తేదీన ఉదయం 9.38 గంటలకు విశాఖలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
అంటే ఒకవేళ రెండో ఛాన్స్ ఇచ్చినా వైసీపి విధానాలు, ధోరణీ రెండూ మారవని, వారు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని అర్దమవుతోంది. గత ఎన్నికల కంటే ఈసారి వైసీపికి మరికొన్ని సీట్లు ఎక్కువ వచ్చినా, ఒకవేళ రాకపోయినా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగితే, ఇక నా అంతటి రాజకీయ మేధావి మరొకరు లేరని, నా ఆలోచనలు, విధానాలు అన్నీ సరైనవే అని మరింత గట్టిగా నమ్ముతూ ఆ మార్గంలోనే ప్రయాణిస్తారు.
జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వరుసగా రెండుసార్లు గెలిచిన పార్టీలన్నీ తలపై కొమ్ములు వచ్చిన్నట్లు ఈవిదంగానే వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ఒకవేళ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వస్తే భవిష్యత్‌లో ఖచ్చితంగా ఇంకా రెచ్చిపోతారే తప్ప గత 5 ఏళ్ళలో తమ అనాలోచిత ఆలోచనలు, అనుచిత రాజకీయాల వలన రాష్ట్రానికి తీరని నష్టం, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గ్రహించకపోవచ్చు.
జగన్‌కు మొదటిసారి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడే తన విశ్వరూపం చూపించి అందరినీ భయపెట్టారు. ఒకసారి సంక్షేమ విధానం ఎంచుకుని ఆ దిశలో ముందుకు సాగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఈ దుస్థితికి చేరుకుంది, మరోసారి అయితే బహుశః రాష్ట్రంలో ఏరుకోవడానికి ఏమీ దొరకకపోవచ్చు.
ఈ 5 ఏళ్ళ జగన్‌లోని అపరిచుతుడుని ప్రజలు చూడగలిగారు. ఆయన పాలన ఎంత విధ్వంసకరంగా ఉంటుందో కళ్ళారా చూశారు. ఆయన చేసిన మేలుతో పాటు దాని చెడు ఫలితాలను ప్రతీ ఒక్కరూ అనుభవిస్తున్నారు కూడా. కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా వ్యవహరిస్తారో, ఏమి చేస్తారో అందరికీ తెలుసు, కనుక రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు.






