నియంత్రణ రేఖ వెంబడి ఉన్న జైషే అతి పెద్ద ఉగ్రవాద శిక్షణా స్థావరంపై మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు అనధికారికంగా వెల్లడైంది. దాడి చేసాకా సురక్షితంగా వెనుతిరిగిరావడం విశేషం. కేవలం 21 నిమిషాల్లోనే శత్రు స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగి వచ్చాయి. ఈ దాడులను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించినట్టు సమాచారం.
దాడి జరుగుతున్నంత సేపు మోదీ కంట్రోల్ రూమ్‌లోనే ఉన్నట్టు తెలిసింది. భారత యుద్ద విమానాలు పని పూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి మన భూభాగంలోకి వచ్చిన తర్వాత ఆయన కంట్రోల్ రూమ్ నుంచి బయటికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆయన వెంబడి ఉన్న ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారులకు అభినందనలు తెలిపారట. ఫిబ్రవరి 14 జరిగిన పుల్వామా ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడిలో దాడిలో 49 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.
ఆ ఘటన జరిగిన 12వ రోజున ప్రధాని మోడీ చెప్పినట్టుగానే ప్రతీకారం తీర్చుకున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం దీనిపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. దాడి జరిగిన మాట వాస్తవమే గానీ ఖాళి ప్రదేశంలోనే బాంబులు పడటం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పుకొచ్చింది. దాడిని ఏ విధంగానూ ప్రతిఘటించకపోవడంతో పాకిస్తాన్ లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ పై దాడి చెయ్యాల్సిందిగా… యుద్ధానికి వెళ్లాల్సిందిగా ప్రధాని పై ఒత్తిడి ఉంది. అయితే అంతటి సాహసం చేస్తారో లేదో చూడాలి.



