నిన్న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మెన్స్ టి-20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఏకంగా 96 పరుగుల భారీ తేడాతో నెగ్గి చరిత్ర పుస్తకాలలో మునుపెన్నడూ సాధ్యం కానీ ఎన్నో రికార్డులను తమ పేరిట రాసుకుంది. ముందుగా అహ్మదాబాద్ స్టేడియంలో గెలిచి, నాటి 2023 వరల్డ్ కప్ గాయానికి బదులు చెప్పింది.
ఇక, నిన్న భారత్ మ్యాచ్ ను ఆరంభించే సమయానికి ముందు నుండే ఈ మ్యాచ్లో భారత్ పెర్ఫామెన్స్ పై అనేక ప్రశ్నలు వెల్లువెత్తడం చూసాము. ఇప్పటి వరుకు ఏ అంతర్జాతీయ జట్టు కూడా టి-20 వరల్డ్ కప్ ను వరుసగా 2 సార్లు గెలవలేదు, హోస్ట్ గా టోర్నీ లో ఆడిన ఏ జట్టూ ఇప్పటిదాకా ఛాంపియన్స్ గా నిలువలేదు.
టి-20 వరల్డ్ కప్ మొదలయి సుమారు 20 ఏళ్ళు కావస్తున్నా, ఈ 20 ఏళ్లలో న్యూజిలాండ్ భారత్ పై 3 మ్యాచ్లు ఆడగా, మూడింటిలోనూ న్యూజిలాండ్ గెలవటం విశేషం. ఐసీసీ నాక్-ఔట్స్ లో చూసుకున్నా, భారత్ కు బ్లాక్-కాప్స్ పైన మంచి రికార్డ్ కనిపించటం లేదు. ఇలాంటి పాత గణాంకాలన్నిటితో భారత అభిమానులు కాస్త భయపడ్డారు.
కానీ, న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి భారత్ ను తొలుత బ్యాటింగ్ కు పంపినప్పుడే ఫ్యాన్స్ కు అర్ధమైపోయింది, ఈ మ్యాచ్ పాత లెక్కలు సరిచేయబోతుందని. టోర్నీ అంతా ఫామ్ కోల్పోయిన అభిషేక్, అతని కెరీర్ లోనే అత్యంత ముఖ్యమైన రోజున తిరిగి ఫామ్ అందుకుని న్యూజిలాండ్ బౌలర్లను కనికరం లేకుండా కొట్టాడు.
విండీస్ పై క్వార్టర్-ఫైనల్ లో 97 పరుగులు, ఇంగ్లాండ్ పై సెమి-ఫైనల్ లో 88 పరుగులతో తన కెరీర్ లోనే అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న సంజు, మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ లో కూడా ఫామ్ ను కొనసాగిస్తూ భారత్ కు 3వ వరల్డ్-కప్ రావటంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు.
బ్యాటింగ్ లో సంజు, అభి, ఇషాన్ లు మొదటి 15 ఓవర్లు అయ్యేపాటికే మ్యాచ్ ను తమ వైపుకు తిప్పేసుకున్నారు. కానీ, ఆ తరువాత కొద్దిగా బ్యాటింగ్ నెమ్మదైనా, చివర్లో దూబే వచ్చి తాను ప్రతి మ్యాచ్లో చేసే పనులే చేసి, భారత్ కు 250+ స్కోరు రావటానికి కారణమయ్యాడు.
255 భారీ టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్ జట్టు తొలి ఓవర్ నుండే కాస్త తడబడుతూ కనిపించింది. ఎప్పుడైతే తమ ఓపెనర్ ఫిన్ అలెన్ వెనుదిరిగాడో, ఆ జట్టుకు గెలుపు ఆశలు కూడా అక్కడినుండి సన్నగిల్లాయి. టిమ్ సైఫర్ట్ కొన్ని భారీ షాట్లకు యత్నించినప్పటికీ, అతడు 52 పరుగుల వద్ద వెనుదిరగకతప్పలేదు.
అలా, న్యూజిలాండ్ ను 255 పరుగుల ఛేదనలో కేవలం 159 పరుగులకే కట్టడి చేసి, భారత్ 96 పరుగుల తేడాతో గెలిచి, టి-20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్ పై తమ మొదటి గెలుపును నమోదు చేసుకున్నారు టీం ఇండియా. దీనితో పొట్టి ఫార్మాట్ లో భారత జట్టు బలమెంతో కూడా ప్రపంచానికి మరోసారి రుజువు చేసింది సూర్య సేన.
ఇలా, గుజరాత్ గ్రౌండ్ నుంచి హోమ్ అడ్వాంటేజ్ వరకు అలాగే న్యూజిలాండ్ పై భారత్ గత ట్రాక్ రికార్డు నుంచి వరుసగా రెండు సార్లు కప్ అందుకునే సెంటిమెంట్ వరకు ఉన్న అన్ని ప్రతికూల అంశాలు కూడా టీం ఇండియా బాట్ అండ్ బాల్ ముందు తలవంచక తప్పలేదు అంటున్నారు భారత క్రికెట్ అభిమానులు.







