స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకుంటున్న నల్లధనం విలువ తగ్గుతోందని గణాంకాలు చెప్తున్నాయి. స్విస్ లో బ్యాంకు ఖాతాలపై నిఘా పెరగడం, అలాగే ఇండియాలో పెరిగిన స్క్రూటినీ తదితర కారణాలతో స్విస్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు దాచుకునే వారి సంఖ్య 1/3వ వంతుకు పడిపోయిందని సమాచారం. డిసెంబర్ 2015 నాటికి 1.2 స్విస్ బిలియన్ ఫ్రాంక్స్ (దాదాపు 8,392 కోట్లు) డబ్బు బ్యాంకుల్లో ఉంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 596 స్విస్ బిలియన్ ఫ్రాంకులు తక్కువని స్విస్ నేషనల్ బ్యాంకు వెల్లడించింది.
1997లో తమ బ్యాంకుల్లోని ఖాతాదారుల వివరాలు బహిర్గతం చేయడం ప్రారంభించిన తరువాత, భారతీయుల ఖాతాల్లో వరుసగా రెండు సంవత్సరాల్లో డబ్బు తగ్గడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి 2006 నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నగదు తగ్గడం ప్రారంభించింది. ఆ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.5 స్విస్ బిలియన్ ఫ్రాంకుల డబ్బు (దాదాపు 23 వేల కోట్లు) ఖాతాల్లో ఉంది. ఆపై నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. మధ్యలో 2011లో ఓ సారి, 2013లో ఓ సారి నల్లధనం మొత్తం పెరిగింది.
ఇక మోడీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత తీసుకుంటున్న చర్యలతో మరింత వేగంగా నల్లధనం తగ్గుతుండటం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ మాసానికల్లా విదేశాలలో దాచిన మొత్తాన్ని తెలియజేయాలని ప్రధాని మోడీ డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే స్విస్ బ్యాంకు ఖాతాల్లో కరెన్సీ తగ్గినంత మాత్రాన బ్లాక్ మనీని అదుపు చేసినట్లు కాదని, అది కేవలం స్విస్ ఖాతాల వరకే సంబంధించినదని, బహుశా స్విస్ ప్రభుత్వం వివరాలు ఇండియాకు ఇస్తోంది గనుక, ఆ బ్యాంకుల్లో దాచుకునే వారి సంఖ్య తగ్గి ఉండవచ్చన్నది మరో వాదన. ఏది ఏమైనా కొంతవరకు నియత్రించగలగడంలో మోడీ సక్సెస్ అయ్యారన్నది పరిశీలకుల మాట.



