ఒకప్పుడు టీమిండియా ‘ఛేజింగ్’ అంటే దాదాపుగా మ్యాచ్ ఓడిపోయినట్లే భావించేవారు. అది కూడా భారీ లక్ష్య చేధన అంటే… ఇక మాట్లాడే పనిలేదు. ఈ ఒరవడి సచిన్ శకం ప్రారంభమైన తర్వాత కొంత తగ్గింది. అయితే కోహ్లి శకంలో మాత్రం ఛేజింగ్ లు చూడడానికి క్రికెట్ అభిమానులు కూడా ఇష్టపడుతున్నారు… అంటే ఏ రేంజ్ లో టీమిండియా లక్ష్యాలను సాధిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా కళ్ళ ముందు భారీ లక్ష్యం ఉందంటే… విరాట్ కోహ్లికి పూనకం వచ్చినట్లే..!
అవును… సాధారణంగా భారీ లక్ష్యం ఉందంటే మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఇది కోహ్లి విషయంలో మాత్రం కాదు. ఎంత పెద్ద లక్ష్యం ఉంటే కోహ్లి అంత పెద్ద స్కోర్ నమోదు చేయడానికి ఆస్కారం లభించినట్లుగానే చెలరేగిపోతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టక ముందు ఒక రేంజ్ లో రెచ్చిపోతే, మరి తన కెప్టెన్సీలో మ్యాచ్ లను ఓడిపోవడానికి కోహ్లి ఇష్టపడతడా? సరిగ్గా ఇదే జరిగింది ఆదివారం నాడు. 62 పరుగులకే ధావన్, రాహుల్, యువరాజ్, ధోని వంటి టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన తర్వాత, విజయం పై ప్రేక్షకులు ఆశను వదిలేసుకున్నారు.
కానీ, విరాట్ కోహ్లి మాత్రం కాదు. తన ఉద్దేశం ఏమిటో తానూ ఎదుర్కొన్న రెండవ బంతినే సిక్సర్ గా మలిచి చెప్పిన విరాట్ కోహ్లి, తన దూకుడుకు అడ్డు లేదన్నంతగా మెరుగైన ఆటను ప్రదర్శించాడు. మ్యాచ్ కే హైలైట్ గా ఓ అనితర సాధ్యమైన షాట్ ను కొడితే… ఇంగ్లాండ్ ప్లేయర్లు సైతం అవాక్కవుతూ చూస్తుండిపోయారు. హెడ్ వేసిన బంతిని బ్యాక్ ఫుట్ లో స్లాప్ చేసిన షాట్ ఏకంగా సిక్సర్ గా వెళ్ళడం విశేషం. మునుపెన్నడూ చూడనటువంటి ఈ షాట్ కు ముగ్ధులైన కామెంటేటర్లు విరాట్ కోహ్లి ప్రతిభ గురించి ప్రశంసలు కురిపించారు.
ఈ క్రమంలో పలు రికార్డులు బద్ధలయ్యాయి. ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన పలు బ్యాటింగ్ రికార్డులను విరాట్ కోహ్లి తిరగరాశాడు. ఛేజింగ్ లు చేసే సమయంలో సచిన్ నెలకొల్పిన 17 సెంచరీలను విరాట్ కోహ్లి సమం చేయగా, అందులో 15 మ్యాచ్ లలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఇదే సచిన్ విషయంలో అయితే సాధించిన 17 సెంచరీలలో 14 మ్యాచ్ లలో మాత్రమే టీమిండియా విజయం సాధించింది. సచిన్ 124 మ్యాచ్ లలో ఈ ఫీట్ సాధించగా, విరాట్ కోహ్లి కేవలం 60 మ్యాచ్ లలో దీనిని అందుకుని సరికొత్త చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించాలన్న సంకేతాలను ఇస్తున్నాడు.



