‘అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో’ వంటి బడా సినిమాలను నిర్మించిన బివిఎస్ఎన్ ప్రసాద్ తాజాగా నిర్మించిన “ఇంట్లో దెయ్యం నాకేం భయం” సినిమా విడుదల పెద్ద నోట్ల రద్దు తర్వాత వాయిదా పడింది. ఓ వైపు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే, ఎంతో కొంత మార్కెట్ ఉండి కూడా అల్లరి నరేష్ వెనుకడుగు వేయడంతో… సినిమా ఫలితంపై ట్రేడ్ జనాల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.
అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ “ఇంట్లో దెయ్యం నాకేం భయం” చిత్ర నిర్మాత విడుదల తేదీని ప్రకటించారు. ఈ సంవత్సరంలో చివరగా విడుదల కానున్న సినిమాగా డిసెంబర్ 30వ తేదీన విడుదలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ధృవ’ సినిమా ధియేటర్లలో సందడి చేస్తుండగా, 23వ తేదీన “సింగం 3” గర్జించడానికి సిద్ధమయ్యాడు. అలాగే సంక్రాంతి సమయానికి ‘ఖైదీ, గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలు ఉండడంతో 30వ తేదీ తప్పితే అల్లరోడుకు మరో అవకాశం లేకుండా పోయింది.
హార్రర్ కామెడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా వర్కౌట్ అవుతున్న నేపధ్యంలో అల్లరి నరేష్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో అన్న ఆసక్తి సినీ వర్గాలలో నెలకొంది. ‘సుడిగాడు’ తర్వాత సడెన్ స్టార్ గా మారిన అల్లరి నరేష్ సరైన సక్సెస్ లేక బాధపడుతున్నాడు. తన దగ్గర ఉన్న కామెడీ కితకితలన్నీ ప్రదర్శిస్తున్నప్పటికీ, అవి ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించకపోవడంతో… చివరి ఆప్షన్ గా మంచి సక్సెస్ రేటు ఉన్న హార్రర్ కామెడీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరి చూడాలి… 2016 అల్లరోడుకు ఫైనల్ ట్విస్ట్ ఇస్తుందేమోనని..!



