బండ్ల గణేశ్… రాజకీయాలలో కూడా కామెడీయేనా?

Bandla Ganesh

ఒకప్పుడు తెలుగు సినిమాలలో హాస్య నటుడుగా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ కాలక్షేపం చేసిన బండ్ల గణేశ్‌కు ఓ రోజు ‘అల్లాఉద్దీన్ అద్భుత దీపం’ దొరకడంతో ఇండస్ట్రీలో పెద్దపెద్ద హీరోలతో సినిమాలు చేసే నిర్మాతగా ఎదిగిపోయారు.

తొండముదిరితే ఊరసరవెల్లి అవుతుందన్నట్లు సినీ రంగంలో రాణించినవారు రాజకీయనాయకులవుతుంటారు. అలాగే బండ్ల గణేశ్‌ కూడా కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికలలో, మళ్ళీ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. కానీ రాజకీయాలలో కూడా కమెడియన్‌గానే గుర్తింపు పొందుతున్నారు తప్ప కాంగ్రెస్‌ టికెట్‌ లభించడం లేదు. కనీసం కాంగ్రెస్‌ నేతగా గుర్తింపు కూడా లభించడం లేదు.

ADVERTISEMENT

అయినా కాంగ్రెస్‌లో విజయశాంతితో సహా అనేక సీనియర్స్ వెయిటింగ్ లిస్టులో ఉండగా బండ్ల గణేశ్‌కు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తారనుకోవడం అత్యశే అవుతుంది కదా? అయినా బండ్ల గణేశ్‌ పట్టువదలని విక్రమార్కుడు టైపు కనుక ఎమ్మెల్యే కాకపోతే రాజ్యసభ సీటు కాకపోతే ఎమ్మెల్సీ సీటు అన్నట్లు ప్రయత్నిస్తున్నట్లున్నారు.

బహుశః ఆ ప్రయత్నాలలో భాగంగానే నిన్న తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పొగుడుతూ, మాజీ సిఎం కేసీఆర్‌ని దుయ్యబట్టారు. ఆయన ఆవేశం చూసి బహుశః కాంగ్రెస్‌ నేతలు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. అంతగా కేసీఆర్‌ని ఏకి పడేశారు.

“కేసీఆర్‌ కట్టుకొన్న ప్రగతి భవన్‌ కోటగోడలు బద్దలు కొట్టి సామాన్య ప్రజలను లోనికి ఆహ్వానిస్తున్నారు సిఎం రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ నేను ఫామ్‌హౌస్‌లోనే పడుకొంటాను… బయటకు రాను… ఎవరినీ కలవను… నా కొడుకు, మేనల్లుడు అన్నీ చూసుకుంటారు అనేవారు.

కానీ సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజల మద్యే వారికి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ అందుబాటులో ఉంటున్నారు. రాష్ట్రంలో మహిళలందరికీ ఉచితంగా బస్సులలో ప్రయాణించే సౌకర్యం కల్పించడంతో ఆ డబ్బుతో మహిళలు చీటీలు వేసుకొని పొదుపు చేసుకొంటున్నారు. అది విని నా మనసు పులకరించిపోయింది…” అంటూ బండ్ల గణేశ్ 50:50 నిష్పత్తిలో చాలా భజన, విమర్శలు చేసారు.

దాని గురించి ఇక్కడ చెప్పాలంటే రేడియోలో ఆకాశవాణి శ్రోతలకు ‘సలార్’ సినిమా కధ చెప్పిన్నట్లే ఉంటుంది కనుక ఆయన ఎంత ఆవేశంగా భజన చేశారో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

ఎప్పుడూ గంభీరంగా సాగే రాజకీయాలలో, వాటిలో ఉండేవారికీ, ప్రజలకు కూడా కాస్త రిలీఫ్ చాలా అవసరమే. కనుక బండ్ల గణేశ్, కేఏ పాల్ వంటివారు చేసే ఇటువంటి హడావుడి కూడా అవసరమే!

అయితే సిఎం రేవంత్‌ రెడ్డి ఈ వీర భజనకు మెచ్చి బండ్ల గణేశ్‌కు వీర తాడు (ఎమ్మెల్సీ) వేస్తారనుకోలేము. ఎందుకంటే వీర తాళ్ళ కోసం లైన్లో చాలా మందే ఉన్నారు. కనుక వీర తాడు ఆశించకుండా బండ్ల గణేశ్ ఈ రాజకీయ కామెడీని కంటిన్యూ చేస్తారా లేదా మళ్ళీ బ్రేక్ తీసుకుని వచ్చే ఎన్నికల వరకు సినిమాలు తీసుకుంటారో?

ADVERTISEMENT
Latest Stories