బీజేపీ మనవైపే ఉందా గురూ?

Chandrababu-Naidu-Narendra-Modi-Amit-Shah-Pawan-Kalyan

ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో బీజేపీతో టిడిపి పొత్తు కుదిరినప్పుడు ఏపీలో రాజకీయంగా ఏదో జరిగిపోబోతోందనే అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. అయితే అటువంటిదేమీ జరుగలేదు. కనీసం వాటి సీట్ల సర్దుబాట్లు, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మ్యానిఫెస్టో వంటివి కూడా అంత గొప్పగా లేవు.

టిడిపి, జనసేనలు అచ్చమైన మిత్రపక్షాలలా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే, బీజేపీ మాత్రం వాటితో ఆంటీ ముట్టన్నట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. తాజాగా మిత్రపక్షమైన జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు విషయంలో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లభించకపోవడంతో బీజేపీ పట్ల జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర అసహనంతో ఉన్నారు.

ADVERTISEMENT

తాజాగా టిడిపి, జనసేనలకు మరో షాక్ తగిలింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి సిట్టింగ్ ఎంపీ, కడప అభ్యర్ది అవినాష్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

వివేకా హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుతో సహా దేశంలో ఇటువంటి కేసులన్నిటికీ పరోక్షంగా రాజకీయ నేపధ్యం, రాజకీయ ప్రభావాలు, సంబందాలు ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఎంతగా ప్రయత్నించినా అరెస్ట్ చేయలేకపోవడమే ఇందుకు చిన్న ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ఈ కేసుతో కేంద్రానికి, టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులకి ఎక్కడా ఎటువంటి ప్రత్యక్ష సంబందం లేదు. కేంద్ర ప్రభుత్వం కోర్టులను, తీర్పులను ప్రభావితం చేయదని సర్ధి చెప్పుకోవచ్చు.

కానీ సరిగ్గా ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగే ముందు అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించడం, ఆయన తండ్రికి బెయిల్‌ మంజూరవడం తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిన్నట్లే అవుతుంది కదా?

తద్వారా బీజేపీ టిడిపి, జనసేనలతో పొత్తుపెట్టుకున్నప్పటికీ అది వైసీపివైపే మొగ్గు చూపుతోందనే తప్పుడు సంకేతం ఇచ్చిన్నట్లయింది. దీనిని వైసీపి తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోకుండా ఉండదు. ముఖ్యంగా కడప కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల, ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సునీతా రెడ్డి ఇద్దరికీ కోర్టు నిర్ణయం పెద్ద షాక్ అనే భావించవచ్చు.

వారిద్దరూ వివేకా హత్యకు అవినాష్ రెడ్డే కుట్ర పన్నారని వాదిస్తుంటే, హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడమే కాకుండా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయడంతో వారిరువురి ఆరోపణలు వీగిపోయిన్నట్లవుతుంది.
కోర్టు తనను నిర్దోషిగా భావిస్తుంటే వారిద్దరూ తనపై బురద జల్లుతున్నారని అవినాష్ రెడ్డి వాదించుకుని ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు కోర్టు ఆయనకు అవకాశం కల్పించిన్నట్లయింది. అలాగే ఆయన విషయంలో టిడిపి, జనసేనలు చేస్తున్న ఆరోపణలకు విలువలేకుండా పోయింది.

కీలకమైన ఎన్నికల సమయంలో వైసీపికి మేలు కలిగేలా కోర్టులు, ఈసీ వ్యవహరిస్తుండటంతో బీజేపీతో టిడిపి, జనసేనల పొత్తులకు అర్దం లేకుండా పోయింది. ఈ అనూహ్య పరిణామాలను చూస్తుంటే టిడిపి, జనసేనలకు బీజేపీ శల్యసారధ్యం చేస్తూ ఈ ఎన్నికలలో వైసీపిని గెలిపించబోతున్నట్లే అనిపించక మానదు.

ADVERTISEMENT
Latest Stories