Jagan Andhra Pradesh Politics

శాసనసభ ఎన్నికలలో వైసీపి ఘోర పరాజయం తర్వాత జగన్‌తో సహా వైసీపి నేతలందరూ కొన్నిరోజులు మౌనంగా ఉండిపోయారు. తర్వాత మెల్లగా ఆ షాక్‌ నుంచి తెరుకున్నారు. రాజకీయాలలో ఇది చాలా సహజమే.

తమ హయాంలో టిడిపి, జనసేనలని దారుణంగా వెంటాడి వేధించినందుకు కూటమి ప్రభుత్వం తమపై వెంటనే చాలా తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలు చేపడుతుందని భయపడ్డారు కూడా. అందుకే చాలా రోజులు జగన్‌తో సహ వైసీపి నేతలు ఎవరూ గడప దాటి బయటకు రాలేదు.

Also Read – హైడ్రా ముగిసిన అధ్యాయమేనా.?

ఆ భయంతో జగన్‌తో సహా వైసీపి నేతలు ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు పారిపోతారని చాలామంది భావించారు కూడా.

కానీ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ కూడా తమకి ప్రతీకార చర్యలు వద్దనుకొనడంతో ఏపీలో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

Also Read – ఈసారి కూడా హాట్ ఫేవరేట్స్ అవేనా.?

వైసీపిపై ఎటువంటి చర్యలు తీసుకోక ముందే జగన్‌ తన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్ళి ఏపీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ధర్నా చేశారు. అవకాశం చిక్కినప్పుడల్లా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు కూడా.

ఈ నాలుగు నెలల్లో దొరికిన ప్రతీ చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ జగన్‌ దూసుకుపోవడం మొదలుపెట్టారు. విజయవాడ వరదల సమయంలో జగన్‌ చేసిన బురద రాజకీయాలే ఇందుకు చక్కటి నిదర్శనం. ఆ తర్వాత తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్‌ అడ్డంగా దొరికిపోయి, ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా ఏమాత్రం తగ్గకుండా కూటమి ప్రభుత్వంతో హోరాహోరీగా పోరాడారు.

Also Read – బీసీల పరిస్థితి మారలేదు కానీ.. కృష్ణయ్యది మారిందిగా!

జగన్‌ ఇదివరకు ప్రజాక్షేత్రంలో లక్షల మంది వాలంటీర్లతో సైన్యం ఏర్పాటు చేసుకోగా, ఈసారి వేలమంది సోషల్ మీడియా వారియర్స్‌ని ఏర్పాటు చేసుకుని వారి భుజాలపై తుపాకీ పెట్టి సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌లను గురి చూసి కొడుతున్నారు. ఆ దెబ్బకు పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల విలవిలలాడటం అందరూ చూశారు.

జగన్‌ దూకుడు చూస్తుంటే ఏపీ రాజకీయాలను చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లు శాశిస్తున్నారా లేక జగన్‌ వారిని ఓవర్ రైడ్ చేసి తాను కోరుకున్నట్లు రాజకీయాలను నడిపించుకుంటున్నారా?అనే సందేహం కలుగుతుంది. కొన్నిసార్లు సిఎం చంద్రబాబు నాయుడు జగన్‌ని రాజకీయంగా కట్టడి చేసిన్నట్లు అనిపిస్తున్నా అటువంటిదేమీ లేదని జగన్‌ దూకుడే చెపుతోంది. ఎప్పటికప్పుడు గోడకి కొట్టిన బంతిలా జగన్‌ వేగంగా తిరిగివస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ బంతి చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల కోర్టులోనే ఉంది.