రాజధాని అమరావతిలో రాయపూడి వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం అపార్ట్‌మెంట్స్ నిర్మించింది. వాటిలో ఒక్కో ఫ్లాట్ 2,500 చ.అడుగుల విస్తీర్ణంతో అత్యంత ఆధునిక సదుపాయాలన్నీ ఉన్నాయి. ఇప్పటికే సీఆర్‌డీఏ వాటిని ప్రభుత్వానికి అప్పగించింది.
సాధారణ పరిపాలన శాఖ అధికారులు నిబంధనలకు అనుగుణంగా వాటిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయిస్తూ వారి ఫ్లాట్స్‌కు ‘నేమ్‌ప్లేట్స్’ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ నెల 24న వాటి తాళాలు వారికి అందజేయబోతున్నారు.
అంత విలాసవంతమైన ఫ్లాట్స్ ఉచితంగా ఇస్తే ఎవరైనా సంతోషంగా తీసుకుంటారు. టీడీపి, జనసేన, బిజేపి మూడు పార్టీల ప్రజాప్రతినిధులు వాటి కోసం ఎదురుచూస్తున్నారు.
కానీ అమరావతిని తీవ్రంగా ద్వేషిస్తున్న, శాసనసభ సమావేశాలకు రావడానికి ఇష్టపడని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీటిని తీసుకుంటారా.. లేదా? కనీసం తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకోనిస్తారా.. లేదా?అనేది సస్పెన్స్!
శాసనసభ సమావేశాలకు రాకుండా జగన్ అండ్ కో తేరగా జీతభత్యాలు తీసుకుంటున్నారంటూ ఇప్పటికే టీడీపి మంత్రులు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు దెప్పిపొడుస్తూనే ఉన్నారు.
ఒకవేళ ఈ ఫ్లాట్స్ తీసుకుంటే ‘అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోందని వాదిస్తూ, అమరావతిని వద్దన్నవారు.. నిసిగ్గుగా సిఎం చంద్రబాబు నాయుడు కట్టించిన ఫ్లాట్స్ తీసుకున్నారంటూ దెప్పి పొడవడం మొదలుపెడతారు. కుదిరితే వాటిలో జగన్మోహన్ రెడ్డికి ఫ్లాట్ నం.11 కేటాయించినా ఆశ్చర్యం లేదు.
ఒకవేళ తీసుకోకపోతే అహంకారంతో తిరస్కరించారని దెప్పిపొడుస్తారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితి అయోమయంగా మారుతుంది. ఒకవేళ వారి అధినేత జగన్, వాటిని వద్దనుకుంటే వారు కూడా ఆయనకు వంత పాడుతూ ‘మీ ప్రభుత్వం కట్టించిన ఫ్లాట్స్ మాకు అవసరం లేదని’ పైకి చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి అద్భుతమైన ఫ్లాట్స్ ‘జగన్ ఇగో’ కోసం వదులుకోవాల్సి వచ్చినందుకు లోలోన కుమిలిపోక మానరు.
సకల సదుపాయాలతో కోట్లు ఖరీదు చేసే ఫ్లాట్ ఉచితంగా లభిస్తున్నా వాటిని తీసుకోవడానికి వైసీపీ సంకోచించే పరిస్థితి ఎందుకు కలుగుతోంది? అని వాళ్ళే ఆలోచించుకోవాలి.




