లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ తాను ముఖ్యమంత్రి అవడానికి జగన్మోహన్ రెడ్డి తనకు తోడ్పడుతారని కేసీఆర్ ఆశపడ్డారు. అందుకే తనకున్న సమాచారం ప్రకారం ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అవ్వాలని కోరుకున్నారు. కానీ ఎన్నికలలో వైసీపి ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ చేయకతప్పడం లేదు.
కేసీఆర్ అహంకారంతో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోతే, జగన్ అంతకు మించి దురహంకారంతో వ్యవహరించడం వలన వైసీపి ఓడిపోయారని చెప్పక తప్పదు. ఇద్దరినీ వారి అహంభావమే మింగేసింది. వారి అహంకారం కారణంగా వారిని నమ్ముకున్న పార్టీ నేతలు అందరూ కూడా మునిగిపోయారు.
కేసీఆర్ సహవాసం కూడా జగన్ (వైసీపి) ఓటమికి కారణమని చెప్పవచ్చు. ఆయన తప్పులు, అహంకారం, నిరంకుశత్వం నుంచి పాఠాలు నేర్చుకొని ఆయనకు దూరంగా ఉంటూ ఆంధ్రా ప్రయోజనాలను కాపాడాల్సిన జగన్మోహన్ రెడ్డి, ఆయనలో చెడుని మాత్రమే అనుకరిస్తూ నష్టపోయారు.
కేసీఆర్ పదేళ్ళ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేశారో కళ్ళారా చూశారు. 2019 ఎన్నికలలో కేసీఆర్ తనను గెలిపించేందుకు మద్దతు ఇచ్చారనే జగన్ అనుకున్నారు తప్ప తన ద్వారానే అమరావతి నిర్మాణం కాకుండా అడ్డుకొని ఆంద్రాకు రావలసిన పరిశ్రమలు, పెట్టుబడులను తెలంగాణకు ఎత్తుకుపోయారని గ్రహించలేకపోయారు.
దాని వలన ఏపీలో యువత ఉద్యోగాలు, ఉపాధి లేక హైదరాబాద్, బెంగళూరు వలసలు వెళ్ళవలసి వస్తే ప్రజలు తననే నిందిస్తారని జగన్ గ్రహించలేదు. గ్రహించినా దురహంకారం వలన అంగీకరించలేదు. చివరికి ఆ అహంకారం వలననే జగన్ కూడా కేసీఆర్‌లాగే ఓడిపోయారు.
కేసీఆర్‌లో చెడుని జగన్ స్వీకరించారే తప్ప ఆయనలాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకోకపోవడం మరో తప్పు. సంక్షేమ పధకాల పేరుతో జనం చేతిలో డబ్బు పెడుతూ వారి ఓట్లు కొనుక్కొని మళ్ళీ అధికారంలోకి రావచ్చని చాలా దుష్ట ఆలోచన చేశారు. కానీ ప్రజలు తనకంటే చాలా తెలివైనవారని బహుశః ఇప్పుడు గ్రహించే ఉంటారు.
అసలు ఓ రాజకీయ పార్టీని నడపడమే ఎంతో కష్టం. అలాంటిది 151,23 సీట్ల భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం అనేది మహాద్భుతమే. కానీ అంత గొప్ప అవకాశాన్ని జగన్ గుర్తించి సద్వినియోగం చేసుకోలేక దురంహంకారంతో విర్రవీగి రెండో ఛాన్స్ చేజార్చుకున్నారని చెప్పక తప్పదు.






