Jagan Cabinet Meetingఈ నెల 7న సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. నిజానికి ఇటువంటి సమావేశాలలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు లేదా చేయాల్సిన పనుల గురించి, ఒకవేళ శాసనసభ సమావేశాలకు ముందైతే… సభలో చర్చించాల్సిన అంశాలు, ప్రవేశ పెటాల్సిన బిల్లుల గురించి చర్చిస్తుంటారు.

కానీ రాష్ట్రంలో సంక్షేమ పధకాలే తప్ప పెద్దగా అభివృద్ధి పనులు జరుగడం లేదు. త్వరలో శాసనసభ సమావేశాలు జరుగబోవడం లేదు. కనుక మంత్రివర్గ సమావేశం దేనికి?అనే సందేహం కలుగుతుంది.

దీని గురించి చెప్పుకొనే ముందు తెలంగాణ సిఎం కేసీఆర్‌ గురించి రెండు ముక్కలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన ఇదివరకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను వేరు చేసుకొన్నారు. తద్వారా రెండు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పూర్తి పట్టు సాధించేందుకు వెసులుబాటు కల్పించుకొన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను వేరు చేయడం వలన ఎన్నికల నిర్వహణ ఖర్చు పెరిగి, ప్రజలపై భారం పెరుతున్నప్పటికీ బిఆర్ఎస్ మాత్రం లాభపడుతోంది.

ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఈ నాలుగేళ్ళ పాలనతోనే జగనన్న ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక, రాజకీయ, న్యాయ సమస్యలతో సతమతమవుతూ, ఉద్యోగులకు జీతాలు, బకాయిలు చెల్లించలేక, సంక్షేమ పధకాలను కొనసాగించలేని పరిస్థితికి చేరుకొంటోంది. ఇక వైసీపీ అవునన్నా కాదన్నా ఏపీలో టిడిపి, జనసేనలు చాలా బలపడ్డాయి. జగనన్న ఎంత వద్దనుకొంటున్నా, ఆ రెండు పార్టీలు చేతులు కలిపేందుకు సిద్దం అవుతున్నాయి.

మరోవైపు బిజెపి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలని బరిలో దించేందుకు సిద్దమవుతున్నాయి. ఇలా నాలుగు ప్రతిపక్ష పార్టీలు బరిలో దిగి, ఓటు బ్యాంకును చీల్చుకొంటే వైసీపీకి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి.

కనుక జగనన్న కూడా కేసీఆర్‌ ఫార్ములా ఫాలో అవుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం చాలా శ్రేయస్కరంగా కనిపిస్తోంది. ఒకవేళ ముందస్తుకి వెళ్ళాలనుకొంటే ఎన్నికల సంఘానికి కనీసం 4-5 నెలల ముందు తెలియజేయాలి. కనుక దాని కోసమే క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తుండవచ్చు. అదే అయితే సమావేశం ముగిసిన తర్వాత సజ్జల వారి ప్రకటనలో తప్పకుండా ముందస్తు సంకేతాలు వినబడతాయి.

ఒకవేళ ముందస్తు ఆలోచన లేదనుకొంటే, వైసీపీ నేతల కుమ్ములాటలు, నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ఎఫెక్ట్, టిడిపి మ్యానిఫెస్టోల ఎఫెక్ట్ గురించి చర్చించి, ఏవిదంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇవిగాక అభివృద్ధి పనుల పేరుతో భూముల కేటాయింపులకు ఆమోదముద్రలు, తర్వాత విశాఖ రాజధాని కబుర్లు, జగనన్న విశాఖ మకాం కబుర్లు ఎలాగూ ఉండనే ఉంటాయి.