జగన్ ఓదార్పు యాత్రలు – పరామర్శ పర్యటనలు పార్టీ క్యాడర్ కు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తాయో, బాధితులకు ఎంత ఊరట కల్పిస్తాయి చెప్పలేం కానీ జగన్ కు మాత్రం ఈ తరహా కార్యక్రమాలు తన బలప్రదర్శనకు మంచి అవకాశంగా మారుతున్నాయి అని చెప్పొచ్చు.
వైసీపీ ఓటమి తరువాత కూడా క్షేత్ర స్థాయిలో తన గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదని, తన పార్టీ పై ప్రేమ వీగిపోలేదని అటు పార్టీ క్యాడర్ లో ఒక నమ్మకాన్ని, ఇటు నాయకులలో ఒక భరోసాను, అలాగే ఇటు ప్రజలలో ఒక విశ్వాసాన్ని నెలకొల్పడానికి జగన్ భారీగా శ్రమిస్తున్నారు.
అధికారంలో ఉన్నంత కాలంలో తాడేపల్లి ప్యాలస్ గేటు దాటని జగన్ ఇక ఇప్పుడు తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ బెంగళూర్ ప్యాలస్ లో ఉంటూ సోషల్ మీడియా పోరాటాలు చేస్తున్నారు. ఇక అడపాదడప రాష్ట్రంలో ప్రకృతి విపత్తులో, అనుకోని విషాదాలో జరిగినప్పుడు,
లేదా తన పార్టీలోని ముఖ్య నాయకులు కానీ, తనకు అత్యంత సన్నిహితులు కానీ తమ అవినీతి కేసులలో అరెస్టయ్యి జైలుకెళ్ళినప్పుడు ఇలా ఈ ఓదార్పు యాత్రలు – పరామర్శ పర్యటనలతో ముందుకొస్తారు. ఇలా వచ్చినప్పుడు కూడా తన చుట్టూ మోతాదుకు మించి క్రౌడ్ ఉండేలా,
వారు కూడా జై జగన్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేసేలా ఐప్యాక్ రాజకీయాలు చేస్తూ ఇటు ప్రజలను అటు పార్టీ క్యాడర్ ను ఏమరుస్తున్నారు వైసీపీ అధినేత వైస్ జగన్ అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వారి ఆరోపణలో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే ఒక్కసారి జగన్ పర్యటనలు గమనిస్తే చావు దగ్గర, సంతాపాలు తెలిపే దగ్గర కూడా వైసీపీ క్యాడర్ జగన్ ను ఉద్దేశించి జై జగన్, సీఎం సీఎం అంటూ నినదిస్తూనే ఉంటారు.
అలాగే రప్ప రప్ప అంటూ రెచ్చకొడుతూనే వస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఆ నినాదాలకు, ఆ రెచ్చకొట్టే చర్యలను అందులో తప్పేముంది అంటూ సమర్థిస్తూ చక్కటి చిరు నవ్వును చిందిస్తూ, వారిని ఇది ఇందుకు సమయం కాదు, ఆ సందర్భం అసలే కాదు అంటూ వారించేది పోయి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్ ను ఉద్దేశించి విమర్శలు ఎక్కుపెడతారు.
దీనితో ఏ అంశాన్ని రాజకీయ కోణంలో చూడాలి, ఏ అంశాలను రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి అనే కనీస అవహగానా లేకుండా జగన్ చెప్పే స్క్రిప్ట్ ప్రసంగాలు ఏపీ రాజకీయాలను మరింతగా పలుచన చేస్తున్నాయిఅనే భావన క్రమక్రంగా సామాన్యుడిలో సైతం బలపడుతుంది.
మొన్నీమధ్య మామిడి తోట రైతులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ కు ప్రభుత్వం పై నిరశన అంటూ ట్రాకర్ల కొద్దీ మామిడి పంటను టైర్ల కింద తొక్కించిన వైసీపీ మద్దతుదారులను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు నెటిజన్లు. ఇది పరామర్శ కాదు పైశాచికత్వం అంటూ ఒకరు, ఇది ఓదార్పు కాదు అహంకారం అంటూ మరొకరు ఇలా ఈ పర్యటన మొత్తం వైసీపీ కి వ్యతిరేకమే అయ్యింది.
ఇక ఇప్పుడు మొంథా తుఫాన్ భీభత్సానికి పంటలను కోల్పోయిన రైతులను పరామర్శించడానికి వైస్ జగన్ రేపు అంటే నవంబర్ 4 న పరామర్శల పర్యటనకు సిద్ధమయ్యారు జగన్. ఈ పర్యటనలో భాగంగా జగన్ కృష్ణ జిల్లా పెడన నియోజకవర్గంలోని గూడూరు లో దెబ్బ తిన్న పంటలను చూడనున్నారు.
అలాగే ఆయా రైతులను పరామర్శించనున్నారు. ఇందుకు గాను వైసీపీ నవంబర్ 4 న జగన్ పరామర్శల షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే బాధితులకు అవసరమైనప్పుడు మద్దతు తెలిపితే అది పరామర్శ అవుతుంది కానీ ఇలా తనకు తన పార్టీకి అవసరమైనప్పుడు, రాజకీయ మైలేజ్ కోసం పరామర్శలు చేస్తే వాటినే ఐప్యాక్ రాజకీయాలు అంటున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు.




