ys-jagan-campaign

ఐదేళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపి ఇప్పుడు ఫలితాలు వెలువడే ముందు తీవ్ర అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోంది.

ఓ వైపు వైసీపి నేతలందరూ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతూనే ఉన్నారు. మరో పక్క జూన్ 9వ తేదీన జగన్మోహన్‌ రెడ్డి విశాఖలో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని కూడా చెప్పుకుంటున్నారు.

Also Read – ఏపీలో వైసీపి లేదు… జగన్‌ ఒక్కరే ఉన్నారట!

ఒకవేళ జగన్‌ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని వైసీపి నేతలు నమ్ముతున్నట్లయితే అందరూ సంతోషంగా కనిపించాలి… మాట్లాడాలి కదా?

కానీ వైసీపి నేతలందరూ చంద్రబాబు నాయుడు ఈసీపై ఒత్తిడి చేసి కీలకమైన ఎన్నికల సమయంలో పోలీస్ అధికారులను మార్పించేశారని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించారని, ఈసీ, పోలీస్ అధికారులు కూడా టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కుప్పం, మాచర్లతో సహా పలు నియోజకవర్గాలలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read – విలువలు విశ్వసనీయత: జగన్ మళ్లీ అదే పాట!

ఈసారి ఎన్నికలలో ఓడిపోతామని గ్రహించబట్టే వైసీపి నేతలు ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారని అర్దమవుతూనే ఉంది. మరి అటువంటప్పుడు జూన్ 9న జగన్‌ విశాఖలో సిఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ఎందుకు చెప్పుకుంటున్నట్లు? అనే సందేహం కలుగక మానదు.

ఇది వైసీపి వ్యూహాలలో చిట్ట చివరిదని చెప్పవచ్చు. కౌంటింగ్‌ మొదలవక మునుపే ఓటమిని అంగీకరించేసి చేతులెత్తేస్తే, వైసీపి శ్రేణులు భయంతో చెల్లాచెదురు అయిపోతాయి. ఈ కారణంగా కౌంటింగ్‌లో పాల్గొనే వైసీపి ఏజంట్లలో నిర్లిప్తత ఏర్పడితే, టిడిపి ఏజంట్లూ రెచ్చిపోతే వైసీపికి ఇంకా నష్టం కలుగుతుంది.

Also Read – ఇంకా తత్త్వం బోధ పడలేదా..? ఇప్పటికైనా కళ్ళు తెరవండి.!

ఇక ఎలాగూ వైసీపి మళ్ళీ అధికారంలోకి రాదని సంకేతాలు ఇస్తే కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులతో పాటు రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఎవరూ కూడా వైసీపి నేతలను ఖాతరు చేయరు. కానీ కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు అధికారులందరూ వైసీపి చెప్పు చేతలలో ఉండటం చాలా అవసరం.

బహుశః అందుకే “విశాఖలో జగన్‌ ప్రమాణస్వీకారం’ అనే కొత్త డ్రామా ప్రారంభించిన్నట్లు భావించవచ్చు. అయితే ప్రమాణస్వీకారం చేస్తామని చెప్పుకుంటున్నప్పుడు ఆ ముక్కని అందరూ సంతోషంగా చెప్పుకోవాలి కదా? అది కూడా ఏడుపు మొహాలతోనే చెప్పుకొంటున్నారే!

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతోందని మూడు నెలల ముందే కేసీఆర్‌తో సహా ఆ పార్టీలో ముఖ్య నేతలందరికీ తెలుసు… అని వారే ఆ తర్వాత చెప్పుకున్నారు. అయినా చివరి నిమిషం వరకు ‘119కి 100 సీట్లు మనకే… సంబురాలకు సిద్దంకండి…’ అంటూ కేటీఆర్‌ చెప్పుకున్నారు.

అచ్చం అలాగే ఏపీలో వైసీపి కూడా తమ ఓటమి ఖాయమని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ, ‘జగన్‌ అనే నేను….’ అంటూ సోషల్ మీడియాలో జగన్‌ ఫోటోతో ఓ మెసేజ్ పెట్టి ‘సంబరాలకి సిద్దమవ్వండి…’ అని పిలుపునిచ్చారు. కనుక ఇప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌ ఎలా సంబరాలు చేసుకుంటున్నారో రేపు జగన్, మంత్రులు కూడా అలాగే సంబరాలు చేసుకోవడం ఖాయమే. కాదనడానికి మనం ఎవరం?