జగన్‌ని కాంగ్రెస్‌ వదులుకోకపోయి ఉంటే…

Jagan Exit: Did Congress Miss a Big Opportunity?

నిన్న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో జగన్‌ పట్ల కాంగ్రెస్‌ అధిష్టానం వివక్ష చూపింది. అందుకే అయన వెళ్ళిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ దెబ్బకు ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ మనుమరుగైంది. అదే… జగన్‌తో మాట్లాడి పార్టీలో ఉంచుకొని ఉంటే నేడు ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్థితి కలిగేదే కాదు. ఆయనే కాంగ్రెస్‌ పార్టీని కాపాడేవారు. ఆనాడు కాంగ్రెస్‌ అధిష్టానం చేసిన ఈ పొరపాటుకి నేటికీ ఏపీ కాంగ్రెస్‌ కోలుకోలేకపోతోంది,” అని అన్నారు.

ADVERTISEMENT

తెలంగాణ కాంగ్రెస్‌లో తనకు తగిన గౌరవం, ప్రాధాన్యం లభించడం లేదనే కోపంతో జీవన్ రెడ్డి పార్టీ వీడారు. కానీ జగన్‌ కాంగ్రెస్‌ని వీడటానికి వేరే కారణాలున్నాయి.

జగన్‌ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కోసమే బ్రతికారు. అధిష్టానం పట్ల విధేయంగా ఉంటూ తన సమర్ధత, తెలివితేటలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.

కానీ జగన్‌ అహంభావి… సోనియా, రాహుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడలేరు. కనుక పార్టీని వీడారు. తండ్రి బ్రతికి ఉండగానే క్విడ్ ప్రోలు చేసి, సొంత మీడియా ఏర్పాటు చేసుకొని పార్టీ ఏర్పాటుకి సకల సన్నాహాలు చేసుకున్నారు. తండ్రి మరణం తర్వాత ఓదార్పు యాత్రలతో సానుభూతి సంపాదించుకొని వైసీపీని నిర్మించుకున్నారు.

రాష్ట్ర విభజన కారణంగానే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని కాంగ్రెస్‌ అధిష్టానానికి ముందే తెలుసు. సోనియా గాంధీ ఏపీ కాంగ్రెస్‌ని బలి చేసుకొని తెలంగాణ ఏర్పాటు చేసిందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలే గర్వంగా చెప్పుకుంటారు కదా?

కాంగ్రెస్‌ అధిష్టానమే పార్టీని వద్దనుకున్నప్పుడు నేతలు, కార్యకర్తలు ఎందుకు ఉంటారు?అందుకే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న వైసీపీలో చేరిపోయారు. కానీ జగన్‌ కూడా తండ్రిలాగే రాజకీయాలు చేస్తారని అనుకున్నవారు షాక్ అయ్యేలా రాజకీయాలు చేస్తున్నారు.

తండ్రి మరణాన్ని, సానుభూతిని, తల్లిని, చెల్లిని, బాబాయ్ వివేకాని తన రాజకీయ ఎదురుగుదలకు వాడుకున్న జగన్‌, ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటే దానిని కూడా తన ముఖ్యమంత్రి కల నెరవేర్చుకోవడానికే వాడుకుని పక్కన పడేసేవారు. కాంగ్రెస్‌ అధిష్టానానికి కొరకరాని కొయ్యలా మారేవారు.

కనుక జగన్‌ని కాంగ్రెస్‌ వదులుకోలేదు. ఆయనే తన ముఖ్యమంత్రి కల నెరవేర్చుకోవడం కోసం కాంగ్రెస్‌ని, చివరికి తల్లిని, చెల్లిని అందరినీ వదులుకున్నారు. కనుక జీవన్ రెడ్డి తన పరిస్థితిని జగన్‌కి అన్వయించి ఈవిధంగా మాట్లాడటమే తప్పు!

ADVERTISEMENT
Latest Stories