వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడంపై నిరసన తెలిపేందుకు నేడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పారీ శ్రేణులతో భారీ ర్యాలీగా అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వస్తున్నారు. కానీ అక్కడ ఆయనకు టీడీపి నేతలు ఊహించని ట్రీట్‌మెంట్ సిద్దం చేశారు. నర్సీపట్నంలో దారి పొడవునా దివంగత డాక్టర్ సుధాకర్ ఫొటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు.
కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవలందించిన డా.సుధాకర్‌ని నడిరోడ్డుపై బట్టలు ఊడదీసి అర్ధనగ్నం నిలబెట్టి, చేతులకు బేడీలు వేసింది. చివరికి ఆయనని పిచ్చివాడనే ముద్రవేసి మెంటల్ హాస్పటల్లో కూడా వేశారు. సమాజంలో ఎంతో గౌరవప్రదంగా జీవించిన ఆయన ఈ అవమానాలు, వేధింపులు వాటితో మానసిక క్షోభ భరించలేక గుండెపోటుతో మరణించారు.
కరోనా సమయంలో మాస్కులు, గ్లౌజులు లేవని చెప్పినందుకు అయనని మానసికంగా, శారీరికంగా ఇంతగా వేధించి చివరికి చనిపోయేలా చేసిన ఆనాటి విషయాలన్నీ గుర్తుచేస్తూ టీడీపి నేతలు పట్టణంలో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఓ వైద్యుడిని ఇంత దారుణంగా వేధించి పొట్టన పెట్టుకున్న జగన్ ఇప్పుడు అదే ఊర్లో వైద్య కళాశాల కోసం పోరాటం అంటూ వస్తుండటం సిగ్గుచేటు అని ఆ ఫ్లెక్సీ బ్యానర్లలో ముద్రించారు.
చాలా కాలంగా తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి బయటకు రాని జగన్మోహన్ రెడ్డి, హైకోర్టు తిరస్కరించిన ఈ అంశం ఎంచుకోవడమే ఓ పొరపాటు. డా.సుధాకర్ పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఆయన మరణాన్ని నర్సీపట్నం ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. రాష్ట్రంలో అనేక వైద్య కళాశాలలు ఉండగా జగన్ పనిగట్టుకొని నర్సీపట్నంకు బయలుదేరడం మరో పెద్ద పొరపాటని ఈ ఫ్లెక్సీ బ్యానర్లతో స్పష్టమవుతోంది.




