ఏపీలో వైసీపి, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీల మద్య ఓ సాపత్యం కనిపిస్తుంది. వైసీపి ఎల్లప్పుడూ వ్యూహాలు (గిట్టనివాళ్ళు కుట్రలు అంటారు)పై ఆధారపడి పనిచేస్తుంటే, బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ‘తెలంగాణ సెంటిమెంట్’పైనే ఆధారపడి రాజకీయాలు చేస్తుంటుంది.
రెండు పార్టీలలో వందలమంది నేతలు, లక్షల మంది సభ్యులు, కార్యకర్తలు ఉన్నప్పటికీ అధినేత పేరు, ఫోటో, భజనతోనే పార్టీలు నడుస్తుంటాయి. వాటి ప్రభుత్వాలలో డజన్లకొద్దీ సలహాదారులను నియమించుకున్నప్పటికీ, పలువురు సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ, వాటి అధినేతలు జగన్, కేసీఆర్ అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకునేవారు.
ఏపీ తరతరాల భవిష్యత్‌ని నిర్దేశించే అమరావతి, పోలవరం విషయంలో జగన్, సుమారు లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చే విషయంలో కేసీఆర్ ఇద్దరూ ఏకపక్ష నిర్ణయాలే తీసుకున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు అందరూ డమ్మీలుగానే మిగిలిపోయేవారు. వారి సలహాలు కాదు కదా కనీసం వారికి అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చేవారు కారు.
అంబానీ అంతటివాడు కూడా తన వ్యాపార సంస్థలని చిరకాలం లాభాలబాటలో నడిపించాలనుకున్నప్పుడు అన్ని నిర్ణయాలు తానే తీసుకోవాలనుకోలేదు. ఆయా రంగాలలో నిపుణులు, మేధావులైన డైరెక్టర్లు, మేనేజర్లతో పటిష్టమైన యంత్రాంగ లేదా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
కానీ రాజకీయ పార్టీలను వ్యాపార సంస్థల్లా నడిపించిన జగన్, కేసీఆర్ కనీసం ఆవిదంగా కూడా వ్యవహరించకుండా తమ సొంత ఆలోచనలు, ఆశలు, కోరికలు, ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలనే పార్టీ విధానాలుగా మార్చేసి ఏకపక్ష నిర్ణయాలతో పాలన సాగించారు.
వాటికి మంచి ఫలితాలు వచ్చినప్పుడు ఆ క్రెడిట్ వారిద్దరే సొంత చేసుకునేవారు. కానీ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని పార్టీలో అందరికీ సరిసమానంగా వాటాలు వేసి పంచేసి, ఓటమికి ‘మనం అందరం’ కారణమని సర్ది చెప్పుకుంటున్నారు తప్ప నేటికీ తమ లోపాలను, వైఫల్యాలను అంగీకరించడం లేదు.
ఈవిదంగా ‘ఓ వ్యక్తి’ ఆధారంగా నడిచే వ్యాపార సంస్థలే ఎల్లకాలం సమర్ధంగా పనిచేయలేన్నప్పుడు, ఓ వ్యాపారసంస్థలా నడిచే రాజకీయపార్టీలని వ్యక్తి ఆధారంగా నడిపిస్తే ఏమవుతుంది? అంటే వైసీపి, బిఆర్ఎస్ పార్టీలని చూస్తే అర్దమవుతుంది. అదే… కాంగ్రెస్, బీజేపీ, టిడిపి వంటి పార్టీలు చిరకాలం మనుగడ సాగించడానికి కారణం వాటికి బలమైన కార్యవర్గాలు కలిగి, విధానపరమైన నిర్ణయాలు సమిష్టిగా తీసుకోవడమే అని చెప్పవచ్చు.




