2027లో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ‘పాదయాత్రల’ చుట్టూ తిరగనున్నాయా? అధికార పీఠమే లక్ష్యంగా పలువురు రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు తమ పాదయాత్రలపై సంకేతాలు ఇవ్వడంతో రానున్న ఏడాది రాజకీయంగా ఆసక్తికరంగా మారనుంది.
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తునట్టు ఇప్పటికే ప్రకటించారు. 2017లో ఒక్కఛాన్స్ కోసం ‘ప్రజా సంకల్పయాత్ర’తో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన జగన్, 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం, జగన్ 2.0 సాధన కోసం మరోసారి పాదయాత్రతో ప్రజల ముందుకు రానున్నారు.
ఇక తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పాదయాత్ర చేస్తానంటూ పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుందనే చర్చ సాగుతోంది.
మరోవైపు కేసీఆర్ కుమార్తె కవిత కూడా ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయడం ఆమె ముందున్న ప్రధాన సవాలు. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేపడతారనే ప్రచారం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం విజయసాయిరెడ్డి రూపంలో కనిపిస్తోంది. ‘పరివర్తన రాజనీతి పార్టీ’తో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, 2027 ఉగాది తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్రనే ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నట్టు తెలుస్తుంది.
ఇలా ఏపీ రాజకీయాల్లో వైసీపీ, పీఆర్పీ ల గెలుపు కోసం జగన్, విజయసాయిరెడ్డి, తెలంగాణలో అధికారం కోసం బిఆర్ఎస్, టిఆర్ఎస్ ల ప్రతినిధులుగా కల్వకుంట్ల వారసులు కేటీఆర్, కవిత.. నలుగురు నాయకులు కూడా తమ తమ పాత వ్యక్తిగత బంధాలను, రక్త సంబంధాలను కూడా పక్కన పెట్టి పాదయాత్రలతో ప్రత్యర్థుల మాదిరి ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగనున్నారు.
దీనితో రానున్న 2027 రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలకు ‘పాదయాత్రల నామసంవత్సరం’గా నిలవనుందా? అన్న చర్చ మొదలైయ్యింది. అయితే పాదయాత్రలు కేవలం ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు మాత్రమే కాదు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, ప్రజా సమస్యలను తెలుసుకోవడం, రాజకీయ ప్రత్యర్థులకు తమ ఉనికిని, రాజకీయ బలాన్ని చాటడం వంటి లక్ష్యాలు కూడా వీటి వెనుక ఉంటాయి.
మరి ఈ నాయకుల యాత్రలు ఆయా పార్టీల రాజకీయ భవిష్యత్తును ఏ మేరకు ప్రభావితం చేస్తాయి? ప్రజల్లో తమ నాయకత్వం పట్ల ఎంతటి విశ్వాసాన్ని పెంచుతాయి? అన్నది వేచి చూడాలి.





