
తిరుగులేని అధికారం చలాయించిన తర్వాత ఎన్నికలలో దారుణ పరాజయం పొందితే ఆ షాక్ నుంచి తేరుకోవడం చాలా కష్టం. తెలంగాణలో కేసీఆర్ నేటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేక ఫామ్‌హౌస్‌లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అంతకంటే పెద్ద షాకే తగిలింది.
తెలంగాణని అభివృద్ధి చేసినందుకు అక్కడి ప్రజలు కేసీఆర్‌కి కనీసం 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు కానీ జగన్ ఏపీని సకల విధాలుగా భ్రష్టు పట్టించేశారు కనుక 11 మంది ఎమ్మెల్యేలనే ఇచ్చారు. 175కి 175 మనకే అనుకున్న జగన్‌కి 11 అంటే చాలా పెద్ద షాకే.
Also Read – అభివృద్ధి కంటే వినాశనానికే మద్దతెక్కువా..?
కానీ సిఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గాడిన పెట్టుకునేలోగానే జగన్ చాలా త్వరగా ఆ షాక్ నుంచి తేరుకున్నారు. తాను ఓడిపోవడం వలన ప్రజలకే కష్టాలు వచ్చిన్నట్లు ఓదార్చి ధైర్యం చెపుతున్నారు కూడా!
జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి ప్యాలస్‌లో మాడుగుల, అనకాపల్లి, చోడవరం ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ 5 ఏళ్ళు మనం చాలా కష్టాలు అనుభవించాలని తెలుసు. చంద్రబాబు నాయుడు మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారని తెలుసు. కానీ ఈ కష్టాలు ఎల్లకాలం ఉండవు.
Also Read – విశాఖ మేయర్ పీఠం కూటమికే… సంతోషమేనా?
నేను 16 నెలలు జైల్లో ఉన్నాను. కానీ బయటకు వచ్చి ముఖ్యమంత్రిని అయ్యాను. ఐదేళ్ళు ప్రజల సంక్షేమం కోసమే పనిచేశాను. చీకటి తర్వాత వెలుగు వచ్చిన్నట్లే ఈ కష్టాలు కలకాలం ఉండవు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము. అంతవరకు అందరూ ధైర్యంగా ఉండాలి,” అని ఓదార్చి ధైర్యం చెప్పారు.
మాజీ మంత్రి పేర్ని నాని నిన్న మీడియాతో మాట్లాడుతూ, “మా మీద కేసులు పెట్టుకుంటారా?పెట్టుకోండి. మా అందరినీ జైళ్ళలో వేస్తారా? వేసుకోండి. మాకేమి భయం లేదు. కావాలంటే 175 నియోజకవర్గాలలో మా నేతలు, కార్యకర్తలు అందరిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసుకున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మా పోరాటం ఆపబోము. రాబోయే 5 ఏళ్ళు పోరాడుతూనే ఉంటాము. మళ్ళీ 2029లో మేమే అధికారంలోకి వస్తాము,” అని అన్నారు.
Also Read – స్మితా సభర్వాల్: ఈమెను ఎలా డీల్ చేయాలబ్బా!
జగన్ ఓడిపోగానే కేసులకు భయపడి విదేశాలకు పారిపోతారని, వైసీపి చెల్లాచెదురు అయిపోతుందని ఊహల్లో బ్రతికేస్తూ సంతోషపడుతున్న టిడిపి శ్రేణులకు వారి సానుభూతిపరులకు జగన్ మాటలు కనువిప్పు కలిగిస్తాయో లేదో తెలీదు. కానీ టిడిపి కంటే జగన్ ఎప్పటిలాగే చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు ప్రజలు ఇంతగా ఛీకొట్టి తిరస్కరించినా జగన్ సిగ్గుపడలేదు. రాజకీయాలు వదులుకోలేదు. మళ్ళీ తప్పకుండా అధికారంలోకి వస్తామనే పూర్తి ఆత్మవిశ్వాసంతో పార్టీ శ్రేణులను సిద్దం చేసుకుంటున్నారు. పేర్ని నాని మాటలే ఇందుకు నిదర్శనం. అంటే వైసీపి మెలుకువగానే ఉంది కానీ టిడిపి ఇంకా మేల్కొవలసి ఉంది.