ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు అమూల్యమైన దాని విలువ గుర్తించి, ప్రజల ఆకాంక్షల మేర పరిపాలన చేసి ఉండి ఉంటే నేడు వైసీపీకి ఈ దుస్థితి ఎదురయ్యేదే కాదు. కానీ అప్పుడు ఇష్టారాజ్యం చేసి చాలా అవమానకరంగా గద్దె దిగాల్సి వచ్చింది.
అయినా కూడా జగన్ తన హయంలో చేసిన తప్పులు ఒప్పుకొని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల వద్దకు వచ్చి ఉండి ఉంటే తప్పకుండా ఆదరించేవారేమో?
కనీసం జగన్ ప్రతిపాదించినట్లే విశాఖని రాజధానిగా చేసి ఉంటే వైసీపీ పరిస్థితి మరోలా ఉండేది. కానీ అదీ చేయకుండా ఏమేమి చేయకూడదో అవన్నీ చేశారు.
సరే తప్పులు చేయడం మనవ సహజమని సర్ది చెప్పుకున్నా నేటికీ జగన్ తీరులో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. శాసనసభలో ప్రజల మద్య ఉండాల్సిన జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
నేడు మరోసారి అదే చేశారు. ఇది ఎప్పుడూ పాడుతున్న పాటే అయినా హటాత్తుగా నేడు ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టారంటే గూగుల్ కంపెనీ క్రెడిట్ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ తమ పద్దులో రాసేసుకుంటున్నారనే దుగ్ధతోనే… అని జగన్ మాటలలోనే తెలుస్తోంది.
నిన్న మొన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని దాని వలన ఏపీకి ఎటువంటి ప్రయోజనమూ ఉండదని వైసీపీ దాని మీడియా వాదించాయి.
కానీ ఇప్పుడు జగన్ దానిని తన హయంలోనే బీజం వేశానని, తన కృషి వలననే గూగుల్ విశాఖకు వస్తోందని చెప్పుకున్నారు. అంటే గూగుల్ వేస్ట్ ప్రాజెక్ట్ అన్న నోటితోనే దాని క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నరన్న మాట!
కానీ చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ తనకు ఇవ్వకుండా కొట్టేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను ఈ ప్రెస్‌మీట్ పెట్టినట్లు ఆయన మాటలతోనే స్పష్టమవుతోంది.
గూగుల్ వేస్ట్ అన్న నోటితోనే ఇప్పుడు దాని వలన మరిన్ని ఐటి కంపెనీలు వచ్చేందుకు తగిన ఇకో సిస్టం ఏర్పడుతుందని చెప్పారు
నకిలీ మద్యం, మద్యం అమ్మకాలు, ఉద్యోగులకు నెలనెలా జీతాల చెల్లింపు, డీఏ బకాయిలు చెల్లింపు ఇలా చాలా అంశాల గురించి జగన్ సుదీర్గంగా మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడిన మాటల్లో తన హయంలో చేసిన, జరిగిన పొరపాట్లన్నిటినీ వల్లెవేసి వాటిని కూటమి ప్రభుత్వానికి ఆపాదించి చెపుతున్నట్లుంది.
నాడు మేము పునాదులు వేస్తే వాటిపై చంద్రబాబు నాయుడు భవనం నిర్మించి ఆ క్రెడిట్ తాను తీసుకుంటున్నారని జగన్ పదేపదే ఆరోపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఒకవేళ అయన మొదలు పెట్టిన పనులను పూర్తి చేసి ఉంటే ఆ క్రెడిట్ ఆయనకే దక్కి ఉండేది కదా? కానీ కొబ్బరికాయ కొట్టేసి క్రెడిట్ కావాలని జగన్ కోరుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
అసలు జగన్ ఇన్ని అభివృద్ధి పనులు మొదలుపెట్టి, ఇన్ని పెద్దపెద్ద కంపెనీలు ఏపీకి రప్పించి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఆయనను వద్దనుకోవడానికి ఆంధ్రా ప్రజలేమైనా పిచ్చివాళ్ళా?
జగన్ చెప్పుకున్నవాటిలో కనీసం పదో వంతు పనులు పూర్తిచేసినా ప్రజలు మళ్ళీ ఆయనకే అధికారం అప్పజెప్పేవారు. కానీ దించేశారంటే అర్ధం ఏమిటి?







