వెనకటికి ఎవరో మేము పేదవాళ్ళమే … మా కారు డ్రైవర్, తోటమాలి, నౌకర్లు అందరూ కూడా పేదవాళ్ళే అన్నాడట!
అదేవిదంగా జగన్ కూడా “నాకు ఆస్తులు లేవు… నా వెనుక మీడియా లేదు. వైసీపి అభ్యర్ధులందరూ కూడా పేదవాళ్ళే… వాళ్ళ ఆస్తులు అంతంత మాత్రమే” అంటూ పరిచయం చేస్తున్నారు.
మంగళగిరి వైసీపి అభ్యర్ధి మురుగుడు లావణ్యని నియోజకవర్గం ప్రజలకు పరిచయం చేస్తూ నారా లోకేష్‌తో పోలిస్తే ఆమెకు పెద్దగా ఆస్తులు లేవని జగన్ చెప్పారు.
ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు. వారి కుటుంబం ఆర్ధికంగా, రాజకీయంగా చాలా బలంగా ఉంది కనుకనే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని, గంజి చిరంజీవిని పక్కన పెట్టి ఆమెను అభ్యర్ధిగా ప్రకటించారని అందరికీ తెలుసు.
అసలు చేతి నిండా డబ్బు, ఖర్చుపెట్టగల ధైర్యం ఉంటేనే ఎవరైనా రాజకీయాలలో ఉండగలరు. ఎన్నికలలో పోటీ చేయాలంటే అన్ని పార్టీలు ముందుగా చూసేది కూడా ఇదే.
పిఠాపురంలో తనను ఓడించేందుకు వైసీపి రూ.100-150 కోట్లు ఖర్చు చేయబోతోందని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. కనుక ఎన్నికలు ఇంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి కనుకనే ఆషామాషీ రాజకీయ నాయకులు ఎవరూ ఎన్నికలలో పోటీ చేయలేరు. చేసినా గెలవలేరు.
కనుక వైసీపి అభ్యర్ధులు పేదవారని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మూడు నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకునేవారు పేదవాళ్ళయితే, సామాన్య ప్రజలు, నిరుపేదలు ఎవరు?
నారా లోకేష్ తాను పేదవాడినని ఎన్నడూ చెప్పుకోలేదు. కోటీశ్వరుడైనప్పటికీ ఏనాడూ ఆ అహంభావం ప్రదర్శించరు. నారా కుటుంబం హెరిటేజ్ డైరీతో సహా విజయవంతంగా నడుస్తున్న పలు వ్యాపారాలున్నాయి. కనుక ఖచ్చితంగా ధనవంతులే. కానీ వైసీపిలో నారా లోకేష్ కంటే చాలా భారీగా ఆస్తిపాస్తులున్న వారు కోకొల్లలు ఉన్నారని, వైసీపి అభ్యర్ధులలో 99 శాతం సంపన్నులే అని అందరికీ తెలుసు.
అయినా వారి ఆస్తిపాస్తులు అంతంత మాత్రం అని జగన్ చెపుతుండటం చూస్తే ఇదో రకం సానుభూతి ప్రయత్నమనిపించక మానదు.
అయినా అభ్యర్ధులు గుణగణాలు, విద్యార్హతలు, ఒకవేళ మంత్రి లేదా ఎమ్మెల్యేగా పనిచేసి ఉంటే వారు తమ నియోజకవర్గం అభివృద్ధికి చేసిన పనుల గురించి ప్రజలకు వివరించి, వారికి ఓట్లు వేయమని జగన్ అడిగితే బాగుంటుంది. కానీ అభ్యర్ధుల ఆస్తిపాస్తుల గురించి జగన్ మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉంది.






