నాకు, నా పార్టీకి అన్యాయం జరిగితే లోకానికి అన్యాయం జరిగినట్లే… నాకు అన్యాయం జరిగితే అందరూ ముందుకు వచ్చి ఖండించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. కనుక ఆయన రాహుల్ గాంధీ కూడా తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలని కోరుకున్నారు. కానీ మాట్లాడటం లేదు.
ఎందుకంటే, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్‌లో రోజూ మాట్లాడుకుంటారు గాబట్టి… అని జగన్ కనిపెట్టి చెప్పారు.
మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని గొంతు చించుకుంటున్న రాహుల్ గాంధీ ఏపీలో జరుగుతున్నన ఈ ఓట్ల గల్లంతు, పోలింగ్ అక్రమాల గురించి మాట్లాడటం లేదు. ఏపీ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌ఛార్జ్ మానిక్కం ఠాగూర్ కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముగ్గురూ హాట్ లైన్‌లో కనెక్ట్ అయ్యుంటారు గాబట్టి,” అని జగన్ అన్నారు.
తనకు జరిగిన అన్యాయం గురించి రాహుల్ గాంధీ, మానిక్కం ఠాగూర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, సొంత చెల్లి వైఎస్ షర్మిల ప్రస్తావన చేయనే లేదు. చేస్తే ఆమె విమర్శలను భరించడం కష్టం అనుకున్నారేమో?
గత ఏడాది జగన్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఆయనకు కాంగ్రెస్ మిత్ర పక్షాల నేతలు సంఘీభావం ప్రకటించారు. కానీ పార్లమెంటులో అవి వివిధ అంశాలపై మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నప్పుడు జగన్ వాటికి మద్దతు ఇవ్వలేదు!. కనుక రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఏవిదంగా ఆశించగలరు?అయినా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, సొంత చెల్లితోనే యుద్ధం చేస్తున్నప్పుడు జగన్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తుంది?
ఇక రాహుల్ గాంధీ-చంద్రబాబు నాయుడు-రేవంత్ రెడ్డి ముగ్గురి మద్య సఖ్యత ఉందని జగన్ చెప్పడం వారి బలాన్ని, తన బలహీనతని చాటుతున్నట్లే ఉంది కదా?
సిఎం చంద్రబాబు నాయుడు బీజేపితో కలిసి పనిచేస్తూనే, దాని బద్ద విరోధి అయిన కాంగ్రెస్ పార్టీతో కూడా స్నేహం కొనసాగించగలగడం, అ పార్టీలో కూడా పరపతి కలిగి ఉండటం, రాజకీయాలు బ్యాలన్స్ చేస్తుండటం గొప్ప విషయమే కదా?
జగన్‌కి అటు బీజేపితో చేతులు కలిపే ధైర్యం లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపలేరు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు రెండు పార్టీలతో సత్సంబంధాలు, పరపతి కలిగి ఉన్నారంటే అది ఆయన గొప్పదనమే తప్ప లోపం కాదు కదా?
జగన్ తనకి సాధ్యం కాని ఈ ‘పొలిటికల్ బ్యాలన్సింగ్’ సిఎం చంద్రబాబు నాయుడు ఆచరణలో చేసి చూపిస్తున్నారని గ్రహించారు. కనుక రాజకీయాల కోసం రోజూ అయనని ఎంతగ్గా విమర్శిస్తున్నా, అయన నుంచి రాజకీయ పాఠాలు కూడా నేర్చుకుంటే జగన్… వైసీపీ బాగుపడగలవు.




