వైసీపీ అధినేత జగన్ చేస్తున్న రాజకీయాలను చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎందుకంటే, అయన చేస్తున్న రాజకీయాలలోనే తేడా కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఓ రకం రాజకీయాలు చేశారు. ఇప్పుడు మరో రకం రాజకీయాలు చేస్తున్నారు.
ఏ రాజకీయ పార్టీకైనా, దాని అధినేతకైనా అధికారంలో రావడం చాలా గొప్ప విషయం. జగన్ అలాంటి ఘనత సాధించారు. కనుక అప్పుడు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఆలోచిస్తూ ఆ దిశలో ముందుకు సాగాలి.
కానీ మొదటి రోజు నుంచే 5 ఏళ్ళ తర్వాత జరుగబోయే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా సంక్షేమ పధకాలు అమలుచేయడం మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే చేస్తోంది. కానీ అదే సమయంలో రాజధాని అమరావతి, పోలవరం నిర్మిస్తోంది. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు రప్పిస్తోంది. కేంద్రం సహాయ సహకారాలతో రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి కూడా చేస్తోంది.
జగన్ కూడా కేసీఆర్‌లాగే రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తే తనకు ఎదురు ఉండదని భావించి టీడీపిని ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బ తీయాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆయన చేసిన ఈ ప్రయత్నాలు, ఈ విధానాల వల్లనే అధికారం కోల్పోయారు.
నిజానికి రాజకీయ అనుభవం లేని సామాన్య ప్రజలు సైతం ఆయన తప్పు దారిలో నడుస్తున్నారని, ఏదో రోజు తప్పకుండా బోర్లా పడతారని ముందే గ్రహించారు. కానీ రాజకీయాలలో తనకు తానే సాటి అని గర్వంగా చెప్పుకునే జగన్ మాత్రం చివరి నిమిషం వరకు గ్రహించనే లేదు!
అప్పుడు సరే! కానీ ఇప్పుడైనా చేసిన తప్పులు తెలుసుకున్నారా?ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని లోపాలు సరిదిద్దుకున్నారా?అంటే లేదనే చెప్పాలి.
నాడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని ప్రయత్నిస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారు. అంతే తేడా!
జగన్ విమర్శిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజల మద్య తిరుగుతూ వారికి మరింత దగ్గరవుతుంటే, జగన్ ప్యాలస్ గడప దాటకుండా రాజకీయాలు చేస్తున్నారు.
ఒకవేళ పరామర్శ పేరుతో ఎప్పుడైనా బయటకు వస్తే పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా బలప్రదర్శన చేయడం ఒక తప్పు. పరామర్శని బలప్రదర్శన యాత్రగా సాగిస్తుండటం మరో తప్పు.
ఈ బలప్రదర్శనలతో ప్రజలు తన వెంటే ఉన్నారని, తన కోసం ఎదురు చూస్తున్నారని జగన్ నిరూపించి చూపాలనుకుంటున్నారు. కానీ ఈవిదంగా జన సమీకరణ చేసి బల ప్రదర్శనలు చేస్తుంటే ప్రజలు అయన వెన్నంటి ఉన్నట్లేనా? ఇలా చేస్తే వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చేయగలమా?సాధ్యమేనా? అని ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే తప్పకుండా జగన్ రాజకీయాలు చేసే తీరు మారేది.
కానీ మాట తప్పను… మడమ తిప్పనని గొప్పగా చెప్పుకుంటారు. కనుక తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళనే వాదనకి కట్టుబడి అలాగే ముందుకు సాగిపోతున్నారు.
మళ్ళీ మనమే అని గుడ్డి నమ్మకం ఆయనలో ఉండటం ఆశ్చర్యం కలిగించదు. కానీ ఆయన వెంట పరుగులు తీస్తున్నవారిని కూడా ఆయన ఆ భ్రమలో ఉంచడం మామూలు విషయం కాదు. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలలో ఉన్నవారందరికీ జగన్ చేస్తున్న ఈ రాజకీయాలు కనువిప్పు కలిగిస్తే అంతే చాలు!







