వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య ఆస్తి వివాదాలు అందరికీ తెలిసిందే. అయితే ఆ వివాదాలు జగన్ మేనకోడలు పెళ్ళికి కూడా అవరోధంగా మారడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. బెంగళూరులోని యలహంక ప్యాలస్‌లో ఆమె తన కుమార్తె పెళ్ళి జరపాలనుకుంటే జగన్ అనుమతించలేదు.
సొంత మేనకోడలు పెళ్ళికి జగన్ ఈవిధంగా అవరోధం సృష్టించడంపై ఇప్పటికే తీవ్ర విమర్శల పాలవుతున్నారు. కనుక మాజీ మంత్రి పేర్ని నాని నష్ట నివారణ కోసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అయితే అయన మాటలతో జగన్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యింది.
జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ ప్రాణభయంతోనే తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రావడం లేదంటూ అయన రాజకీయ ప్రత్యర్ధులు తరచూ ఎద్దేవా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పేర్ని నాని కూడా అది నిజమని ధ్రువీకరించినట్లు మాట్లాడారు.
“యలహంకలో జగన్, షర్మిల ఇళ్ళు, సిబ్బంది నివాసాలు, కార్యాలయాలు ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయి. రెండు ఇళ్ళకు ఒకటే ప్రధాన ద్వారం.
కనుక షర్మిల నివాసంలో పెళ్ళి జరిగితే, బయట నుంచి డెకరేషన్, క్యాటరింగ్, క్లీనింగ్, ఇంకా చాలా మంది అపరిచితులు వస్తారు. వారి వలన జగన్‌కు ముప్పు ఏర్పడవచ్చు. అందుకే యలహంకలో పెళ్ళికి అనుమతించలేదు.
బయట ఎక్కడైనా పెట్టుకోమని చిలక్కి చెప్పినట్లు చెప్పారు. కానీ షర్మిల పంతానికి పోయి యలహంకలోని తన నివాసంలో కూతురు పెళ్ళి పెట్టుకున్నారు,” అని పేర్ని నాని అన్నారు.
అంటే చీమ కూడా దూరలేని యలహంక ప్యాలస్‌లో కూడా జగన్ తీవ్ర అభద్రతాభావంతో జీవిస్తున్నారని పేర్ని నాని చెప్పారన్న మాట!
బెంగళూరులో ప్యాలస్‌లో ఉన్నప్పుడే జగన్‌కు ఇంత ప్రాణ భయం ఉన్నట్లయితే, అడుగడుగునా రాజకీయ ప్రత్యర్ధులున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్భయంగా ఎలా తిరగగలరు? రాష్ట్రంలో ప్రజల మధ్య తిరగడానికి భయపడుతుంటే ఆయన వైసీపీని ఎలా గెలిపించుకోగలరు?అనే సందేహాలు కలిగించారు పేర్ని నాని.
మరోవిషయం ఏమిటంటే, ఒకవేళ జగన్-షర్మిల మధ్య ఈ ఆస్తి వివాదాలు లేకపోయుంటే, అప్పుడు జగన్ దంపతులు దగ్గరుండి యలహంకలో మేనకోడలి పెళ్ళి చేసేవారే కదా? కనుక ఇది ఆస్తి వివాదమా లేక పేర్ని నాని చెప్పినట్లు ప్రాణ భయంతో తీసుకున్న నిర్ణయమా?





