ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన గృహప్రవేశానికి ముహూర్తం ఎట్టకేలకు ఖారారైంది. ఈ నెల 14న జరగాల్సిన ఆ కార్యక్రమం షర్మిల ఆరోగ్యం బాగోక వాయిదా వేస్తున్నామని పార్టీ నేతలు ప్రకటించారు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి లో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి ఈ నెల 27న ఆయన గృహ ప్రవేశం చేయనున్నారు. అదే ముహూర్తాన పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. లండన్ పర్యటనలో ఉన్న జగన్ రేపు తిరిగొస్తున్నారు.
నూతన గృహప్రవేశం తర్వాత ఇకపై తాడేపల్లి నుంచే వైసీపీ కార్యక్రమాలను జగన్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28న తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ సమర శంఖారావం సభలో జగన్ పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీల అధినేతలతో అమరావతిలో సొంత ఇల్లు కలిగిన నేత ఒక్క జగన్ మాత్రమే. ఇప్పటివరకూ హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ నివాసం నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జగన్ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ అవ్వడం గమనార్హం. ఇందులో కూడా ఒక లెక్క ఉంది.
రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అధికారపార్టీ గట్టిగా ప్రచారం చేస్తుంది. జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుండి తరలిస్తారని ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రభావం చాలా వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల మీద పడేలా ఉంది. దీనిని ఎదురుకోవడానికి జగన్ అమరావతికి మకాం మారుస్తున్నారు. చంద్రబాబు అయితే ఇన్ని సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉంటున్నారు… నేను సొంత ఇల్లు నిర్మించుకుని ఉంటున్నా అని అక్కడి ప్రజలలో భరోసా నింపడానికి ప్రయత్నం చేస్తారు. చూడాలి ఇది ఎంతవరకు సఫలం అవుతుందో?



