గులకరాయితో తగిలిన గాయం కంటే, దాంతో తీవ్ర గాయమైన్నట్లు నటించడం, అందుకోసం జగన్ నుదుటన బ్యాండెయిడ్ వేసుకొని, వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి పెద్ద బ్యాండేజ్ వేసుకొని తిరగడానికి పాపం చాలా ఇబ్బందే పడి ఉంటారు.
నిజానికి ఎవరికైనా అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదంలో గాయపడినప్పుడు బంధుమిత్రులు అందరూ వచ్చి పరామర్శించి సానుభూతి తెలుపుతారు. కానీ జగన్, వెల్లంపల్లి కట్లు వేసుకొని తిరుగుతుంటే టిడిపి నేతలు వారిని ఎకసెక్కాలు చేసారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ వారిద్దరితో ఓ ఆట ఆడుకున్నారు.
ఓ గులక రాయితో అంత దూరం నుంచి గురిచూసి కొట్టడం, ఒకే రాయితో ఒకేసారి ఇద్దరినీ కొట్టడం సామాన్యమైన విషయం కాదని, ఆ రాయి విసిరిన వ్యక్తిని జగన్ పెద్ద మనసుతో క్షమించేసి ఒలింపిక్స్ పంపిస్తే భారత్‌కు బంగారు పతకాలు సాధించుకు వస్తాడని కొందరు నెటిజన్స్ వాదించారు.
అత్త కొట్టిందనే బాధ కంటే తోటికోడలు నవ్వినందుకే ఎక్కువ బాధ కలుగుతుందన్నట్లు అందరూ వెక్కిరిస్తుండటంతో అది భరించలేక ముందు జగన్మోహన్ రెడ్డి బ్యాండెయిడ్ తీసేశారు. ఎక్కాడా కుట్లు వేసిన మచ్చ కూడా లేదు. అది చూసి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా బ్యాండేజ్ తీసేసి హమ్మయ్య అనుకుని తిరిగేస్తున్నారు.
గమ్మతైన విషయం ఏమిటంటే, ‘గులకరాయితో ముఖ్యమంత్రిని హత్యాయత్నం’ అనే పెద్ద క్రైమ్ స్టోరీ సృష్టించి సానుభూతి ఓట్లు సంపాదించాలనుకుంటే, చివరికి ఇలా అభాసుపాలయ్యారు. ఈ సలహా ఇచ్చిన పెద్ద మనిషి ఎవరో కానీ తీసుకున్న జీతానికి న్యాయం చేయలేదనే చెప్పాలి.




