ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లని కూడా పూడ్చలేకపోతోందని ఆ మద్యన మీడియా కోడై కూసింది. అది వాస్తవమే కావడంతో మంత్రులు గట్టిగా ఖండించలేకపోయారు. గత రెండు మూడు నెలలుగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా జీతాలు చెల్లించకపోతోంది. దాంతో వారు రోడ్లపైకి ఆందోళనలు చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్, కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు. ఇదీ నిజమే కనుక వైసీపీలో ఎవరూ ఖండించలేకపోయారు.
అయితే సంక్షేమ పధకాలతో వచ్చే ఎన్నికలలో గట్టెక్కవచ్చని గట్టిగా నమ్ముతున్న వైసీపీ ప్రభుత్వం, నానాటికీ ఆర్ధిక సమస్యలు పెరిగిపోతుండటంతో ఇప్పుడు వాటినీ కొనసాగించడానికి చాలా ఇబ్బంది పడుతోంది. కనుక వృద్ధులు, ఒంటరి మహిళలు, వింతంతులు, వికలాంగులు తదితరులకు ఇస్తున్న పెన్షన్ల భారం తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లుంది. నిసహాయులైన వారు పోరాడలేరు కనుక వైసీపీ ప్రభుత్వం వారిపై కొరడా జళిపించిన్నట్లుంది.
సంబందిత అధికారులు వారందరికీ నోటీసులు పంపిస్తున్నారు. పింఛన్ కోసం ప్రభుత్వం అనేక నిబందనలు విధించి, వాటి ప్రకారమే అర్హులను ఎంపిక చేసి పింఛన్లు చెల్లిస్తోంది. కానీ వారిలో సుమారు 1.60 లక్షల మందికి నిబందనలకు వ్యతిరేకంగా పింఛను పొందుతున్నారని కనుక 15 రోజులలోగా అధికారుల ముందు హాజరై సంతృప్తికరమైన వివరణ, అందుకు సంబందించిన పత్రాలను సమర్పించాలని ఆ లేఖలలో సూచిస్తున్నారు. ఒకవేళ 15 రోజులలో సమాధానం చెప్పలేకపోతే వారి పింఛన్ శాస్వితంగా నిలిపివేయబడుతుందని ఆ నోటీసులలో అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఉదాహరణకి నెలకి 300 యూనిట్స్ కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించేవారు, మూడెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు, ఆదాయపన్ను చెల్లిస్తున్నవారు, కార్లు లేదా వ్యాన్లు వంటి నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నవారు ఈ పింఛనులు పొందడానికి అనర్హులు.
ఇప్పుడు అధికారులు పింఛనుదారులకి పంపుతున్న నోటీసులలో ఆ నిబందనలలో ఏదో ఒకటి పేర్కొంటూ వాటికి వ్యతిరేకంగా పింఛను అందుకొంటున్నట్లు గుర్తించామని, కనుక పింఛన్ ఎందుకు నిలిపివేయరాదో 15 రోజులలోగా తెలియజేయాలని లేకుంటే నిలిపివేస్తామని నోటీసులలో పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఆ పింఛనులపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న అనేకమంది ఆ నోటీసులను చూసి లబోదిబోమని మొత్తుకొంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో నిసహాయంగా జీవిస్తున్న వృద్ధులు, నిరుపేద ఒంటరి మహిళలు, వికలాంగులు ఈ నోటీసులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఈ చిన్నపాటి ఆధారం కూడా ప్రభుత్వం తీసేస్తే తాము ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానీ వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికల వరకు సంక్షేమ పధకాలను కొనసాగించవలసి ఉంటుంది లేకుంటే వాటి లబ్ధిదారులే వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే సంక్షేమ పధకాల కోసం ఈ మూడున్నరేళ్ళుగా చేసిన ఈ ఖర్చంతా వృధా అయిపోతుంది. కనుక ఆర్ధికభారం తగ్గించుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుగా పోరాడలేని నిసహాయులపై కొరడా జళిపించిన్నట్లుంది.



