సీపీఐ నేత నారాయణ ఏపీలో రాజకీయ పార్టీల పొత్తుల గురించి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తే మంచిదే కానీ పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా తమతో కలుపుకొనేందుకు చేస్తున్న ప్రయత్నమే వాటి కొంప ముంచుతుందన్నారు. బీజేపీని కలుపుకొంటే గెలుస్తామనుకొంటున్నారని కానీ వారి కూటమే ఓడిపోతుందన్నారు. బీజేపీని కలుపుకొంటే వైసీపి గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుందని నారాయణ అన్నారు.
బీజేపీ, జనసేనల మద్య పొత్తు ఉన్నప్పటికీ, మోడీ, అమిత్ షాలు పవన్ కళ్యాణ్ కంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం గమనిస్తే వారు ఏపీలో ఎవరు గెలవాలని కోరుకొంటున్నారో అర్దమవుతుందన్నారు.
బీజేపీని వదులుకొంటే సీపీఐ, సీపీఎం పార్టీలు టిడిపి, జనసేనలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాయని నారాయణ చెప్పారు. బీజేపీతో కూటమి కంటే తమతో కూటమి ఏర్పాటు చేసుకొంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆమోదిస్తారని నారాయణ అన్నారు. కనుక తమ ప్రతిపాదనపై టిడిపి, జనసేనలు ఆలోచించాలని నారాయణ విజ్ఞప్తి చేశారు.
బీజేపీతో కలిస్తే టిడిపి, జనసేనల కూటమి ఓడిపోతుందని, జగన్ మళ్ళీ గెలుస్తారని నారాయణ చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నా కాస్త లోతుగా ఆలోచిస్తే ఆయన వాదనలో బలం ఉందని అర్దమవుతుంది.
వాటితో బీజేపీతో కలిస్తే, వైసీపి వెంటనే అందుకు తగ్గట్లుగా తన వ్యూహం మార్చుకొంటుంది. ప్రత్యేకహోదా, రైల్వే జోన్, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్, మెట్రో వంటి విభజన హామీలను అమలుచేయకుండా, ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న బీజేపీతో అవి పొత్తు పెట్టుకొన్నాయని వైసీపి ప్రచారం ప్రారంభిస్తుంది.
అయితే ఈ ప్రచారంతో బీజేపీకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ దాంతో దానికి కొత్తగా కలిగే నష్టమేమీ ఉండదు. కానీ దాంతో పొత్తుపెట్టుకొన్న టిడిపి, జనసేనలు నష్టపోవచ్చు.
మరో విషయం ఏమిటంటే ఏపీలో అధికారంలోకి రావాలని వైసీపి, టిడిపి, జనసేనలు తపించి పోతున్నాయి కానీ బీజేపీ ఆశ పడటం లేదు. కనుక ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీ అధిష్టానానికి పెద్ద తేడా ఉండదు. అందువల్ల ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందనే వైసీపి చేసే ప్రచారాన్ని కూడా లైట్ తీసుకొంటుంది.
ఎందుకంటే, ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాగూ తమకే మద్దతు ఇస్తారని మోడీ, అమిత్ షాలకు తెలుసు. కనుక ఒకవేళ టిడిపి, జనసేనలతో బీజేపీ కలిసినా మోడీ, అమిత్ షాల మనసు మాత్రం జగన్ వైపే ఉంటుందని చెప్పవచ్చు.
తెలంగాణలో కేసీఆర్‌తో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తున్న మోడీ, అమిత్ షాలు ఆయననే గెలిపించేందుకు ఏవిదంగా సహకరిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. రేపు ఏపీలో కూడా వారు అదేవిదంగా చేయవచ్చు. కేసీఆర్ కోసం తెలంగాణ బీజేపీని బలిచేసుకోవడానికి వెనుకాడని మోడీ, అమిత్ షాలు ఏపీ బీజేపీని కూడా జగన్ కోసం బలిచేయకుండా ఉంటారా?బీజేపీని బలి చేసుకొన్నప్పుడు టిడిపి, జనసేనలను బలిచేయడానికి వెనకాడుతారా?కనుక సీపీఐ నారాయణ చెప్పిన్నట్లు టిడిపి, జనసేనలు బీజేపీతో పొత్తు గురించి పునరాలోచించుకోవడం మంచిదేమో?




