అవును! ఏపీ రాజధాని అమరావతి విషయంలో జగన్ విధానలే రాష్ట్రానికి చాలా మేలు! అని అంటే చాలా మందికి కోపం రావచ్చు. ఇక్కడే చదవడం ఆపేయవచ్చు.
కానీ జగన్ విధానాలే అమరావతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీరామ రక్ష! ఇది నూటికి నూరు పాళ్ళు నిజం! నమ్మడం లేదా?అయితే ఇది చదవాల్సిందే!
మద్యం కుంభకోణంలోనే జగన్ రూ.3,500 కోట్లు పక్కకి లాగేశారని సిట్ అధికారులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. లక్షల కోట్లున్న ఆయనకు జస్ట్ రూ.3,500 కోట్లు ఏ మూలకి?అంటే ఈ కేసు ఎంత చిన్నదో అర్దమవుతుంది.
ఒకవేళ చంద్రబాబు నాయుడు తర్వాత జగన్ అమరావతి నిర్మాణాలను కొనసాగించి ఉంటే కనీసం ఓ 50-75 వేల కోట్లు పక్కకి లాగగలిగేవారు. కానీ ఆయన వద్దనుకున్నారు. కనుక ఆ మేరకు ఏపీకి ఏంతో మేలు చేసినట్లే!
లక్షల కోట్లు విలువచేసే అమరావతిని 5 ఏళ్ళు పాడుబెట్టేసి రాష్ట్ర ప్రజలకు అమరావతి విలువ బాగా తెలిసి వచ్చేలా చేసింది ఎవరు? జగనే కదా?
మూడు రాజధానుల డ్రామాలతో రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరమో ప్రజలకు బాగా తెలిసి వచ్చేలా చేసింది ఎవరు? జగనేగా?జగన్ని చూసి భయపడే కదా ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అధికారం కట్టబెట్టారు?మరి ఆయనని ఆడిపోసుకోవడం తప్పు కదా?
ఏది ఏమైనప్పటికీ నేటికీ జగన్ అమరావతి పట్ల తన నిబద్దతను చాటుకుంటూనే ఉన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు అమరావతికి ఎప్పుడు వెళ్ళారో తెలీదు కానీ జగన్ మాత్రం ప్రతీరోజూ అమరావతిని వరద నీటితో తన సొంత మీడియాలో, సోషల్ మీడియాలో కడుగుతూనే ఉన్నారు.
అమరావతి విషయంలో తన వైఖరి ఏమాత్రం మారలేదని ప్రజలకు బాగా అర్దమయ్యేలా ప్రతీ రోజూ గుర్తుచేస్తున్నారు. కనుక తన విషయంలో మళ్ళీ పొరపాటు చేయకుండా ప్రజలను జగనే అప్రమత్తంగా ఉంచుతున్నారు. చకచకా సాగుతున్న అమరావతి నిర్మాణ పనులకు జగన్ అడ్డుకోలేకపోతున్నా తాను మళ్ళీ వస్తే ఎక్కడివక్కడ నిలిచిపోతాయని ప్రజలు బాగా గ్రహించేలా చేస్తున్నారు.
ఇదివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు అమరావతి నిర్మాణానికి ఇంత తొందరపడేవారు కారు. కానీ ఇప్పుడు మూడేళ్ళు గడువు పెట్టుకొని చకాచకా పనులు పూర్తి చేయిస్తున్నారు. జగన్ భయంతోనే కదా?
చంద్రబాబు నాయుడు చకాచకా అమరావతి నిర్మించేసి ప్రజలకు చూపించి మళ్ళీ ఎన్నికలలో గెలుస్తారు. మళ్ళీ జగన్ వస్తే అమరావతి ఎన్నటికీ పూర్తి కాదనే భయంతోనే ప్రజలు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కనుక జగన్ అమరావతి నిర్మించకుండా అడ్డుపడుతున్నారని అపోహ పడుతున్నవారందరూ ఇది బాగా అర్దం చేసుకోవాలి.
జగన్ అమరావతి బురద జల్లుతునందుకు ప్రజలకు బాధ కలుగుతున్నా, ఈ ‘మరక మంచిదే.. చాలా అవసరమే’ అని గ్రహిస్తే ఎవరూ ఆయన చేస్తున్న ఈ మహోపకారాన్ని మారిచిపోరు.
కనుక చంద్రబాబు నాయుడే స్వయంగా అమరావతిని నిర్మిస్తున్నట్లు పైకి అందరికీ కనబడుతున్నప్పటికీ, కారణ జన్ముడైన జగన్ అయన చేత నిర్మింపజేస్తున్నారని చెప్పక తప్పదు.




