దసరాకు రిలీజైన రెండు పెద్ద సినిమాలు యుఎస్ బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. “జై లవకుశ” మరియు “స్పైడర్” రెండూ 1.5 మిలియన్ మార్క్ ను అందుకుని, ఆయా హీరోల కెరీర్లలో కొత్త రికార్డులను సాధించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి వరుసగా మూడు సినిమాలు 1.5 మిలియన్స్ అందుకుని, దక్షిణాదిలో ఈ ఫీట్ ను అందుకున్న తొలిహీరోగా తన పేరును నమోదు చేసుకోగా, తాజాగా ప్రిన్స్ కూడా మరో రికార్డును కైవసం చేసుకున్నాడు.
1.5 మిలియన్స్ సాధించిన చిత్రాల జాబితాలో “స్పైడర్”తో ప్రిన్స్ మహేష్ బాబు నాలుగవ సంఖ్యను అందుకుని, యుఎస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తాను చాటుకున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగల్చనున్నాయి. “జై లవకుశ” భారీ నష్టాలను కాకపోయినా, ఓ మాదిరి నష్టాలను మిగల్చగా, “స్పైడర్” మాత్రం యుఎస్ డిస్ట్రిబ్యూటర్ కు కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పడంలో సందేహం లేదు. మహేష్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా ‘స్పైడర్’ నిలవడం కూడా ఓ రికార్డే.
భారీ నష్టాలను మిగిల్చిన ఈ రెండు సినిమాల గురించి సోషల్ మీడియాలో ఇద్దరు అభిమానులు గొప్పగా చెప్పుకోవడం అసలు ట్విస్ట్. యావరేజ్ టాక్ తో ‘జై లవకుశ’ మరియు ఫ్లాప్ టాక్ తో ‘స్పైడర్’ సినిమాలు ఈ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేశాయని ఫ్యాన్స్ రెండు చిత్రాలపై గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ప్రీమియర్స్ తోనే ‘స్పైడర్’ 1 మిలియన్ అందుకోగా, అక్కడ నుండి 1.5 మిలియన్ కు చేరుకోవడానికి ఏడు రోజుల సమయం తీసుకోవడం చూస్తుంటే… కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.





