నేడు ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ‘సేన ప్రస్థానం – జాతీయ సమగ్రత కోసం’ అనే కార్యక్రమంలో ఆయన అనేక అంశాల మీద తన అభిప్రాయాలను పంచుకున్నారు. జనసేన తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ ఏర్పాటు చేసిన విధానానికి వ్యతిరేకం అంటూ మరోసారి తన ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టినంత స్పష్టంగా చెప్పారు.
అయితే నాటి విభజన సమయానికి నేటి కి కాంగ్రెస్ రాజకీయంలో ఎటువంటి మార్పులు రాలేదని, అందుకు తాజాగా తెలంగాణలో జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడమే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ పేర్కొన్నారు. అలాగే జనసేన ఎప్పుడు పార్టీ కంటే కూడా ప్రధమ ప్రాధాన్యం దేశానికే ఇస్తుందంటూ జనసేన జాతీయవాదాన్ని మరోసారి చాటిచెప్పారు.
అలాగే ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన ‘కాక్రోచ్ పార్టీ’ మీద కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. కాక్రోచ్ అనే పేరు వినగానే తనకు ‘సుమతి శతకం’ గుర్తొచ్చింది, చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు, చలి చీమలు కూడా ఒక బలమైన సర్పాన్ని చంపేస్తామని,
ఇలాంటి వారి ఆలోచనలు దేశ సమగ్రతను బలిచేస్తాయని, వారి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదని తన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. అయితే జనసేన వంటి ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో రాజకీయ గుర్తింపు పొందడానికి, జనసేన విభజన రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పడానికే ఢిల్లీ కేంద్రంగా పవన్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు స్పష్టమవుతుంది.
అయితే కాక్రోచ్ పార్టీని ఉద్దేశించి పవన్ చేసిన చలి చీమలు కామెంట్స్ కీలకంగా మారింది. కాక్రోచ్ లు పవన్ అన్నట్టుగా చలిచీమలు అయితే మరి ఆ బలమైన సర్పం బీజేపీ అవుతుందా.? చలిచీమలను సర్పం తక్కువ అంచనా వేసినట్టుగానే బీజేపీ కూడా కాక్రోచ్ పార్టీని తక్కువ అంచనా వేస్తే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పవన్ బీజేపీ శ్రేణులను హెచ్చరిస్తున్నారా.
కాక్రోచ్ జనతా పార్టీ, పేరుతోనే సంచలనం సృష్టించిన క్షేత్ర స్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది రానున్న కాలంలో తెలుస్తుంది. అయితే అప్పటి వరకు బీజేపీ కాక్రోచ్ పార్టీని చలిచీమల గా భావించి వాటి తాలూకా నిరశనలను, నినాదాలను తక్కువ అంచనా వేయకుడని పవన్ చేస్తున్న సూచనలు బీజేపీ చెవికెక్కించుకుంటుందా.?




