విజయవాడలో ఉన్న బడాబాబుల గుట్టురట్టు చేసింది మునిసిపల్ కార్పొరేషన్ సంస్థ. తమకు మొండి బాకీలుగా మారిన 70 కోట్ల రూపాయల జాబితాలో ఉన్న “ప్రబుద్ధుల” వివరాలను విడుదల చేసింది. ఈ పన్ను ఎగవేతదారుల జాబితాలో ఉన్న వారంతా పొలిటికల్ బిగ్ షాట్స్ మరియు నగరంలో ఏళ్ళ తరబడి వ్యాపారాలు చేస్తూ, ఆర్ధికంగా బాగా సెటిల్ అయిన వారు కావడం విశేషం. విఎంసీ (విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్) బయటపెట్టిన ఈ జాబితా పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
బకాయిల వివరాల్లోకి వెళ్తే… కేబీఆర్ కన్ స్ట్రక్షన్స్ గ్రూప్ 53 లక్షల రూపాయల ఆస్తి పన్ను… రెడ్ క్రాస్ సొసైటీ 15.63 లక్షల రూపాయలు, విజయకృష్ణ సూపర్ బజార్ 15 లక్షల రూపాయలు, బికాంలో ఫిజిక్స్ పెట్టిన ఎమ్మెల్యేగా కితాబు అందుకున్న జలీల్ ఖాన్ 14.86 లక్షల రూపాయలు, ఎంపీ కేశినేని నాని 9.44 లక్షల రూపాయలు, అగ్రి గోల్డ్ సంస్థ 6 లక్షల రూపాయల బాకీలు, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ 5.81 లక్షలు, స్టెల్లా కాలేజీ 4.9 లక్షల రూపాయలు ఉన్నట్లు తేలింది.
అలాగే ఎమ్మెల్యే బొండా ఉమ 2.85 లక్షలు, ఎన్ఏసీ కల్యాణ మండపం 2.53 లక్షల రూపాయలు, సీఎస్ఐ చర్చ్ 2 లక్షలు, హెల్ప్ హాస్పిటల్ 1.98 లక్షలు, కార్పొరేటర్ దేవినేని అపర్ణ 1.98 లక్షలు, ఏపీఎస్ఆర్టీసీ 1 లక్ష రూపాయలు, పోలిస్ కమిషనర్ గెస్ట్ హౌస్ 97 వేలు, దేవినేని నెహ్రూ కుమార్తె దేవినేని క్రాంతి 38,000 రూపాయలు బకాయిలున్నారని విజయవాడ నగరపాలక సంస్థ తెలిపింది. ఈ జాబితాలో సుమారు 100 మంది బడాబాబులు ఉన్నారని, వారి జాబితా విడుదల చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు.



