పెద్ద నోట్లు రద్దయినా తన కుమార్తె వివాహాన్ని అత్యంత వైభవంగా, దేశమే నివ్వెరపోయే విధంగా జరిపించి, మరోసారి వార్తల్లో నిలిచిన గాలి జనార్ధన్ రెడ్డికి కాలం కలిసి వస్తున్నట్లుగా ఉంది. ఈ పెళ్లిపై ఐటీ శాఖ చేపట్టిన విచారణ తూతూమంత్రంగా ముగియగా, తాజాగా బెయిల్ స్కాం కేసులోనూ గాలికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
కర్ణాటకలోని గనుల అక్రమ తవ్వకం కేసులో విచారణను ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. తాను జైల్లో ఉన్న సమయంలో బెయిల్ ఇచ్చేందుకు 100 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు నమోదైన కేసులో, ఆయనకు బెయిల్ ను రద్దు చేయాలని ఏసీబీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసు విచారణలో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి జైల్లో గడిపిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. ఏసీబీ వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరుగగా, తన క్లయింటు బెయిల్ ను రద్దు చేయాలని కోరడం ఏసీబీ కక్షపూరిత చర్యగా గాలి తరఫు న్యాయవాది వాదించారు.



