వైసీపీ హయాంలో జగన్ ప్రభుత్వం తమ పద్దతిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఘన విజయం సాధించి కాలర్ ఎగరేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ పార్టీకి అర్ధమయ్యే భాషలోనే ఎన్నికలు నిర్వహించి, అది జీర్ణించుకోలేని స్థాయిలో ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చింది.
మున్సిపల్ ఎన్నికల మొదలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు అన్నిటిలో జగన్ కడప కంచుకోటను బద్దలు కొట్టింది. అలాగే అటు తిరుపతి, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయిజిల్లా, నెల్లూరు, కర్నూలు మొదలు ఇటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వరకు వైసీపీని కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. రేపు జరుగబోయే పంచాయతీ ఎన్నికలలో కూడా కూటమి ఘన విజయం సాధించడం ఖాయమనే భావించవచ్చు.
ముఖ్యంగా కడప జిల్లాతో సహా వైసీపీ కంచుకోటలో జనసేన అభ్యర్ధులు విజయం సాధించడం వైసీపీ జీర్ణించుకోవడం కష్టమే. ఎందుకంటే, ఆ పార్టీకి సొంతంగా బలం, ప్రజాదరణ ఏమీ లేవని టీడీపితో అంటకాగుతూ పబ్బం గడుపుకుంటోందని వైసీపీ చులకనభావం ప్రదర్శించేది.
కానీ కడపతో సహా పలు జిల్లాలలో జనసేన అభ్యర్ధులు విజయం సాధించి తమ సత్తా చాటుకున్నారు. తాము వైసీపీని కూడా ఎదుర్కొని పోరాడి గెలవగలమని నిరూపించి చూపారు. నాడు జనసేనాని పవన్ కళ్యాణ్ పట్ల జగన్ అవహేళన మాట్లాడినందుకు, జనసైనికులు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. దీనిని అయిష్టంగానైనా స్వీకరించక తప్పదు.
కూటమి విషయానికి వస్తే దానిలో చిచ్చుపెట్టి జనసేనను ఏదోవిధంగా బయటకు లాగేస్తే కూటమి బలహీనపడి చిన్నాభిన్నం అయిపోతుందని వైసీపీ ఆశ పడుతుంటుంది. కానీ ఈ ఎన్నికలలో జనసేన అభ్యర్ధుల విజయంతో కూటమి మరింత బలపడినట్లయింది.
ఇదే స్ఫూర్తి, ఉత్సాహంతో జనసేన పార్టీ గ్రామస్థాయి వరకు బలోపేతం అవగలిగితే, అది కూడా రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా మారి నిలబడగలదు.





