ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తే.. అధికారులపై వేటు!

Donald Trump faces Republican election defeat

ఒక రాజకీయ పార్టీ గెలుపోటములకు అది భారత్‌లోనైనా.. అమెరికాలోనైనా అనేక కారణాలు ఉంటాయి. గెలిచిన పార్టీలకు తాము ఎందువల్ల గెలిచామో చెప్పగలవు. కానీ ఓడిపోయిన పార్టీలు మాత్రం తమ ఓటమికి తమ తప్పులు, తప్పటడుగులు, వైఫల్యాలని ఒప్పుకోవు. చెప్పుకోవు. తమ ఓటమికి ప్రత్యర్ధుల కుట్రలే కారణమని వాదిస్తుంటాయి.

కానీ కొంత కాలం తర్వాత వివిధ సందర్భాలలో ఒక్కో తప్పు, వైఫల్యాన్ని మెల్లగా బయటపెట్టుకొని వాటి కారణంగా ఓడిపోయామని చెప్పుకొని బాధపడుతుంటాయి.

ADVERTISEMENT

అధికారంలో ఉన్న పార్టీలు కూడా తమ విజయాల గురించి గొప్పగానే చెప్పుకుంటాయి. కానీ తమ ఓటములకు అధికారులనో మరొకరినో బాధ్యులను చేసి చేతులు దులుపుకుంటాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కూడా సరిగ్గా ఇదే చేశారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఓడిపోవడంతో వైట్‌హౌస్‌ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్‌పై వేటు వేసి ఆమె కింద పనిచేస్తున్న స్టీఫెన్ మిల్లర్‌ను ఆ పదవిలో నియమించారు. ఇంకా పలువురు ఉన్నతాధికారులపై వేటు వేస్తున్నారు.

అయితే ట్రంప్‌ వైఖరి కారణంగానే ఈ ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఓడిపోయిందనే విషయం అందరికీ తెలుసు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్న చిత్రవిచిత్రమైన నిర్ణయాలు, ఇరాన్‌తో యుద్ధం వంటివి అమెరికా ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికన్ల జీవితాలను కూడా దుర్భరం చేస్తున్నాయి.

అలాగే ట్రంప్‌ దుందుడుకు నిర్ణయాల వలన తీవ్రంగా నష్టపోయిన విదేశీయులు కూడా ఈ ఎన్నికలలో ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నారు. కనుక ఇది ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుగానే చూడాలి.

నిన్న సిఎం చంద్రబాబు నాయుడు బాపట్లలో మీడియాతో మాట్లాడుతూ, పాలకుల తీరుతో ప్రజలు వేసారిపోయినప్పుడు ఇలాగే జరుగుతుందని రిపబ్లికన్ పార్టీ ఓటమిని విశ్లేషించారు. ఇది అక్షరాల నిజమని రిపబ్లికన్ పార్టీ ఓటమితో తేట తెల్లమైంది.

ఏపీలో వైసీపీ లేదా తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ లేదా మరో రాష్ట్రంలో మరో పార్టీ కావచ్చు… ఏదైనా సరే వాటి ఓటమికి వాటి అధినేతల వైఖరి, వారి తప్పుడు నిర్ణయాలే ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఆ తర్వాతే మిగిలినవన్నీ!

ADVERTISEMENT
Latest Stories